కోదాడ, మే 17 : వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ పట్టణంలో పలువురు ఆకతాయిలు తమ ద్విచక్ర వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ పోలీసులు పట్టుపడ్డారు. దీంతో ఆ వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా తొక్కించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను అసౌకర్యానికి, భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. యువకులు బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ రంజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్ పాల్గొన్నారు.