– మున్సిఫల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ
నీలగిరి, ఆగస్టు 27 : నల్లగొండ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై రోడ్లపై బిచ్చలవిడిగా వదిలితే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ బి.వంశీ కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లపై పశువులు సంచరించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు, పశువులు అకస్మాత్తుగా వాహనాల ముందుకు రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపైకి వదలకుండా తమ సొంత స్థలాల్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు.
రోడ్లపై పశువులను విచ్చలవిడిగా వదిలే యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేసి ఏడు రోజులలోపు పశువులను రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించనున్నట్లు తెలిపారు. 7 రోజుల గడువు అనంతరం కూడా పశువులను రోడ్లపైకి వదిలినట్లయితే, సంబంధిత యజమానులపై మున్సిపల్ చట్టం- 2013 ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులను నగరపాలక సంస్థ సిబ్బంది పట్టుకొని గోశాలలకు తరలించడంతో పాటు, పశువుల యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపైకి వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు.