వలిగొండ, ఏప్రిల్ 22 : సుప్రసిద్ధ తెలుగు, సాంస్కృత సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతిచెందారు. ఆచార్య రవ్వా శ్రీహరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామం. నిరుపేద పద్మశాలి కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి తెలుగు, సాంస్కృత సాహితీ దిగ్గజాల్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చిత్తూరు జిల్లాలోని దక్షిణాది భాషలకు నిలయమైన కుప్పం ద్రావిడ యూనివర్సిటీకి 2002లో వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. రవ్వ శ్రీహరి మృతికి జిల్లాలోని సాహితీవేత్తలు, రచయితలు, కవులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలుగు, సంస్కృత భాషలకు తీరని లోటు అని పేర్కొన్నారు.
-తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్
కోదాడ రూరల్ : తెలంగాణ భాషా సాహిత్యానికి చిరునామా రవ్వా శ్రీహరి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తేజ విద్యాలయంలో తెర సాంస్కృతిక కళామండలి, తేజ విద్యాలయ సంస్థలు సంయుక్తంగా శనివారం రవ్వా శ్రీహరి సంస్మరణ సభ నిర్వహించాయి. కార్యక్రమంలో పాల్గొన్న జూలూరి గౌరీశంకర్ రవ్వా శ్రీహరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమకాలిన కాలంలో తెలుగు, సంస్కృత భాషలకు ఆయన చేసిన సేవలకు మహోపాధ్యాయ బిరుదు సంపాదించాయన్నారు. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెర సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, ఎస్వీ విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర్రావు, బడుగుల సైదులు, రమాసోమిరెడ్డి, జానకిరాములు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య
రామన్నపేట : ప్రముఖ సాహితీవేత్త రవ్వ శ్రీహరి మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. రవ్వ శ్రీహరి తన బాల్యమిత్రుడని, మునిపంపుల గ్రామంలో ప్రాథమిక విద్యను కలిసి అభ్యసించామని తెలిపారు. శ్రీహరి బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడని, చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలోని తాత మిర్యాల కనకయ్య ఇంట్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారామని చెప్పారు. శ్రీహరి యాదగిరిగుట్ట సాంస్కృతిక పాఠశాలలో చేరి విద్యను అభ్యసించారని, అంచెలంచెలుగా ఎదగి తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా, ద్రవిడ విశ్వావిద్యాలయ ఉప కులపతిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఆయన రాసిన నిఘంటువులు వ్యాకరణ శాస్త్రం, పదకోశ సిద్ధాంతం ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 1990వ దశకంలో అన్నమాచార్య సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారని, రేడియా పాఠాల ద్వారా సంస్కృత భాషను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని తెలిపారు.