నల్లగొండ సిటీ, మే 28 : ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వాహనాలకు లైసెన్స్‌లు జారీ చేస్తూ.. వారి ద్వారా ఒక్కో లైసెన్స్‌కు రూ.250 నుంచి రూ.300 వరకు అధికారులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంలో ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. లైసెన్స్‌ల కోసం వచ్చిన వారు బయటకు వెళ్లకుండా గేటు వేసి, వారి వద్ద సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో ఏజెంట్ల ద్వారా అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు. వాహనాలను తనిఖీ చేసే అధికారి కారుకే నెంబర్ ప్లేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఏసీబీ దాడుల విషయం తెలుసుకున్న పలువురు ఏజెంట్లు షాపులకు తాళాలు వేసి పరారు కాగా, ఆరుగురి ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పని చేయకుండా ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా చేయిస్తున్నారన్నారు. ఎంవీఐ, అసిస్టెంట్ ఎంవీఐ ఆఫీస్ సిబ్బంది.. ఏజెంట్ల ద్వారా అఫీసులో లైసెన్స్‌లు, ఆర్సీలు ఇతర డాక్యుమెంట్లను చేయిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆరుగురు ఏజెంట్లను విచారించి వారి వద్ద నుంచి రూ.12,500 నగదు, 50 నుంచి 60 లైసెన్స్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అధికారుల అశ్రద్ధతోనే కార్యాలయంలోకి ప్రైవేటు ఏజెంట్లు వచ్చి పనులు చేస్తున్నారని తెలిపారు. లైసెన్స్‌లకు సంబంధించిన మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించవలసి ఉన్నదని, వాటి పరిశీలన అనంతరం బాధ్యులైన పలువురు అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సూచించారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు.