కోదాడ రూరల్, జూన్ 23 : కోదాడ పట్టణ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన చదరంగం క్రీడాకారుడు మేకల అభినవ్‌ను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు. సోమవారం అభినవ్ 35వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆయన కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్న వయస్సులో అభినవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం క్రీడా ప్రపంచానికి తీరని లోటన్నారు. ఆయన పేరుతో నిర్మించిన స్టేడియాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
పది పరీక్షా ఫలితాల్లో జిల్లా ప్రథమ స్ధానం సాధించిన విద్యార్థిని తాళ్లూరి రేఖాశ్రీని ఎమ్మెల్యే నగదు బహుమతితో సత్కరించి, ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్‌లో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించేందుకు మండల విద్యాధికారి, హెచ్ఎం, ఉపాధ్యాయ బృదం కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల క్రీడా మైదానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం.డి సలీం షరీఫ్, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్షినారాయణరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ తిరుపతమ్మ, సుధీర్, వైస్ చైర్మన్ ఎస్కె బషీర్, పార సీతయ్య, పైడిమర్రి సత్యబాబు, మేకల వేంకటేశ్వర్లు, అరుణ, ఎస్.కె నయీం, దొంగరి శ్రీను, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పంది తిరపతయ్య, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.