చండూరు, ఆగస్టు 23: రాత్రికి రాత్రి ధాన్యం నిల్వలు మాయమైన సంఘటన చండూరులో చోటు చేసుకుంది. చండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ధాన్యం గోల్మాల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి సేకరించి గోదాంలో నిల్వ చేసిన సుమారు రూ.23 లక్షల విలువగల 850 క్వింటాళ్ల ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి తరలించుకుపోయిన సంఘటన చండూరు మండలం, మున్సిపాలిటీలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ వ్యవహరంలో ధాన్యాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారితో పాటు అతడిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మార్కెట్ యార్డులోని గోదాంను మిల్లరు తేలుకుంట్ల శ్రీనివాస్‌కు ధాన్యం నిల్వల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. గోదాంలో భారీగా ధాన్యం నిల్వ ఉన్న విషయాన్ని గమనించిన చిరుధాన్యాల వ్యాపారి నాగిళ్ల ఆంజనేయులు నకిలీ తాళం చెవి తయారు చేయించి గోదాంను తెరిచినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం రాత్రివేళల్లో లారీలను తీసుకొచ్చి ధాన్యాన్ని దశలవారీగా తరలించి సూర్యాపేట తదితర ప్రాంతాల్లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
రాత్రివేళల్లో లారీల ద్వారా ధాన్యం తరలిస్తున్న విషయాన్ని మార్కెట్ పక్కన ఉన్న ఒక వ్యక్తి గమనించి కొందరు రాజకీయ నాయకులకు ఇట్టి విషయాన్ని తెలియజేయగా వారు వచ్చి వ్యాపారిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసులకు, అధికారులకు చెబుతామంటూ ఇప్పటికిప్పుడు మాకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా చేసేదేమీలేక వ్యాపారి తన వద్ద ఉన్న బంగారాన్ని వారికి ఇచ్చి.. మళ్లీ ఉదయం ఆ బంగారం తీసుకొని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి నగదు సమకూర్చి వారికి చెల్లించినట్లు తెలుస్తోంది.
ఈ నగదు పంపకాల్లో ముఠా సభ్యుల మధ్య విభేదాలు రావడంతో ధాన్యం దొంగతనం వెలుగులోకి వచ్చిందని స్థానికులు అంటున్నారు. తన గోదాంలో ధాన్యం పోయినట్లు తేలుకుంట్ల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ధాన్యం తరలించినట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యాపారీతో పాటు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలుకు పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో మార్కెట్ యార్డు భద్రత, గోదాం పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు, విమర్శలు తలెత్తుతున్నాయి. సుమారు నెల రోజుల నుంచి రాత్రివేళల్లో లారీల రాకపోకలు సాగుతూ ధాన్యాన్ని దొంగతనంగా తరలించుకుపోతుంటే సెక్యూరిటీ సిబ్బది, మార్కెట్ కమిటీ, అధికారులు మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గేటు తాళాలు ఎవరి అధీనంలో ఉన్నాయి? గోదాం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లారీల రాకపోకలకు సంబంధించిన ఎంట్రీ రిజిస్టర్లు నిర్వహించారా? అని అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం మార్కెట్ నుంచి తరలిపోతున్నా మార్కెట్ కమిటీ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు, సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియకుండా ఉండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా బడా రాజకీయ నాయకుల పాత్ర ఏమైనా ఉందా? ధాన్యం తరలించడానికి సహకరించిన వారెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మార్కెట్ యార్డులో రైతుల ధాన్యానికి భద్రత కల్పించాల్సిన పాలక వర్గం, అధికారులు వారితో చేతులు కలిపారా? అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.