సూర్యాపేట, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో 84.83 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నాలుగు నియోజక వర్గాలు కలిపి 9,85,962 మంది ఓటర్లు ఉండగా …… మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ గంట గంటకు పెరుగుతూ వచ్చింది.
మధ్యాహ్నం తర్వాత ఓటర్లు పోలింగు కేంద్రాలకు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగియగా అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన ఓటర్లకు టోకెన్లు అందజేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలో అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 87.51 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా సూర్యాపేట నియోజక వర్గంలో 79.95 శాతం నమోదైంది.
పోలింగ్‌కు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి అధికారులు పోలింగ్ శాతాన్ని విడుదల చేశారు. ఈ ప్రకారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు జిల్లాలో 9.48 శాతం నమోదు కాగా 11 గంటలకు 22.58 శాతానికి చేరుకున్నది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు 44.14 శాతానికి, 3 గంటలకు 62.07 శాతానికి, 5 గంటలకు వరకు 74.88 శాతంగా నమోదైంది. అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్లు అందజేయగా రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దాంతో జిల్లాలో పోలింగ్ శాతం…..కు చేరుకున్నది.
2014లో 80.52 శాతం, 2018లో 86.55 శాతం 2023లో 84.83 శాతం పోలింగ్ జరిగింది.జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి 1.72 శాతం పోలింగ్ తగ్గింది. 2014 ఎన్నికల నాటికి సూర్యాపేట జిల్లా ఏర్పాటు కాకపోగా నాడు ప్రస్తుత జిల్లా పరిధిలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నాలుగు నియోజక వర్గాల పరిధిలో 8,73,176 మంది ఓటర్లు ఉండగా 7,02,808 మంది ఓటింగులో పాల్గొనగా 80.52 శాతంగా పోలింగ్ నమోదైంది.
2018లో జరిగిన ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 8,82,736 మంది ఓటర్లు ఉండగా 7,63,917 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో నాడు 86.55 శాతంగా పోలింగ్ నమోదైంది. అలాగే తాజాగా గురువారం జరిగిన పోలింగ్‌లో 9,85,962 మంది ఓటర్లు ఉండగా 7,88,276 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో 84.83 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2018 నాటికి 6.03 శాతం పెరుగగా ఈ సారి అంటే 2023 ఎన్నికల్లో గత ఎన్నికలతో పోల్చితే 1.72 శాతం తగ్గింది.