కాంగ్రెస్ పాలకులు చిన్న విమర్శను కూడా సహించడంలేదు. అర్ధరాత్రిళ్లు, తెల్లవారుజామున తలుపులు బద్దలు కొట్టడం నయా ట్రెండ్‌గా మారింది! మొన్నటికి మొన్న మన్నె క్రిశాంక్ విషయంలో జరిగిందేందో ప్రతి ఒక్కరూ చూసిండ్రు. ఈ నెల 18న తెల్లవారుజామున పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి.. గేటు, తలుపులు బద్దలు కొట్టారు. ఇంత హడావుడి ఎందుకు అంటే ‘మేం కేవలం నోటీసు ఇవ్వడానికి వచ్చాం’ అని పోలీసులు చెప్తుంటే.. జనాలు నవ్వుకుంటున్నారు.
నోటీసు ఇయ్యడానికైనా తెల్లవారుజామున తలుపులు బద్దలు కొడతారా? ఈ రచ్చ చూసి క్రిశాంక్ ఏడేండ్ల చిన్న పాప భయంతో ఎంతగా వెక్కివెక్కి ఏడ్చిందో అందరూ చూసిండ్రు. ఇక అదే రోజు పోలీసులకు హైకోర్టు చెంపపెట్టులాంటి ఆదేశాలు ఇచ్చింది. ‘బీఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం ముందుగా నోటీసు ఇవ్వండి.. ఏడేండ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిర్దేశిత విధానాలు పాటించాలి తప్ప, పట్టుకుని అరెస్టు చేయడానికి వీల్లేదు’ అని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు ఇదే విషయం తెలిపింది. ‘రాజకీయ విమర్శలను యాంత్రికంగా నేరాలుగా మార్చకండి. శాంతి భద్రతలకు నిజంగా ముప్పు ఉంటే తప్ప అరెస్టులు చేయకూడదు’ అని. కానీ కాంగ్రెస్ సర్కార్‌కు కోర్టుల మొట్టికాయలు వేసేదాకా నిబంధనలు గుర్తుకొస్తలేవు.
మైక్ దొరికితే సీఎం రేవంత్ ఊగిపోతుంటడు. మొన్న అసెంబ్లీలో మరీ ఘోరంగా చిందులేసిండు. కేసీఆర్‌కు ఉన్న 67 ఎకరాల ఫామ్‌హౌస్ భూముల లెక్క ముప్ఫై రోజుల్లో తేల్చి, ఆ భూములను దళితులకు పంచుతానని అన్నాడు. ఇక్కడ రెండు విషయాల గుర్తించాలి. కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాల సామ్రాజ్యం అని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చింది అబద్ధమే కదా! ఆ సంగతి అలా ఉంచితే, సీఎం ఉస్కో అనడంతోనే అధికారులు టేపులు, సర్వే అతారెలు పట్టుకొని ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న రైతుల భూముల మీద పడ్డరు. అసలు సినిమా అక్కడే మొదలైంది! రైతులు ఎదురు తిరిగిండ్రు. మా బతుకులు ఆగం జేయడానికి వచ్చిండ్రా? మా పొలాలు ఎందుకు కొలుస్తున్నరు?’ అని తిరగబడ్డరు.
దీంతో సర్కారోళ్ల వ్యూహం బెడిసికొట్టి బూమరాంగ్ అయింది. సీన్ రివర్స్ కావడంతో అధికారులు తోకముడిచి పరుగెత్తారు.
రేవంత్ ఏదేదో మాట్లాడుడు, మంత్రులు హడావుడి చేసుడు చూస్తూనే ఉన్నాం. క్షేత్రస్థాయిలో వచ్చేసరికి అంతా అబద్ధాలే అని అర్థమైపోతున్నది. ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే, పాలకులు, వారి ఆదేశాలతో ఆగమాగం చేసే అధికారులకు దిమ్మతిరిగిపోవడం కొత్త కాదు క దా. కేసీఆర్ భూముల లెక్క తేల్చుతామని రేవంత్ గొంతునొచ్చేటట్టు అరిచాడు. చలో తేల్చుకుందాం అని బీఆర్ఎస్ లీడర్లు సవాల్ చేసిండ్రు. ఈ సవాల్‌ను రేవంత్‌రెడ్డి ఎందుకు స్వీకరించలేదు? ఇగ ఏది ఏమైనా ముఫ్పై రోజుల గడువు తర్వాత రేవంత్ ముఖం చూడాలె ఎట్లుంటదో!
ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ ముచ్చట అందరికీ ఎరుకే! అంతటితో ఆగకుండా, ఏకంగా కాంగ్రెస్ ‘బీ-ఫామ్’ పట్టుకుని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిండు. గీ ముచ్చట దునియ మొత్తం తెలిసిందే. కానీ మన స్పీకర్ సార్ మాత్రం నాగేందర్ పార్టీ మారినట్టు ‘స్పష్టమైన ఆధారాలు లేవు’ అంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. బహిరంగ వేదికల మీద కండువాలు మార్చినా రుజువులు కనపడకపోవడం ఎందుకో మనకు తెలియదు.
అధికార పార్టీ పట్ల వల్లే స్పీకర్ పక్షపాత వైఖరి చూపారని విపక్షాలు ఆరోపిస్తున్నయి. చివరికి హైకోర్టు అనర్హత వేటు వేసిన తర్వాత అయినా స్పీకర్ గారికి ఆధారాలు అంటే ఏంటో తెలిసి ఉంటుందా? ఏమో! ఇగ ఉపఎన్నికలో దానం నాగేందర్ పోటీ చేస్తడా? చేస్తే ఏ పార్టీ నుంచి? అనే చర్చ జోరందుకున్నది? టెన్త్ షెడ్యూల్, రాజ్యాంగబద్ధమైన స్థానం అని పెద్ద మాటలు చెప్పినా, ఫిరాయింపుల విషయంలో కాలయాపన చేస్తూ, తీరా న్యాయస్థానాలు తిట్టిపోసే పరిస్థితి రావడం ఆ పదవికి ఉండాల్సిన గౌరవాన్ని దిగజార్చుకోవడం కాదా? అని మనం అడగవచ్చు.. కానీ అంత పెద్ద మనిషికి తెల్వదా ఏంది?
అసెంబ్లీ అంటే ప్రజల సమస్యల మీద చర్చలు జరగాలి. కానీ ఇస్కూల్ పిల్లల తొండి ఆటలా మారిపోతే ఎట్ల? మొన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే నవ్వాలో, ఏడ్వాలో అర్థమే కాలేదు. సభ మొదలయ్యిందో లేదో, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద అధికార పక్షం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంకేముంది, సభలో మొండిగోడల ముందు మీసాలు మెలేయడానికి రూట్ క్లియర్ అయిపోయింది! అసలు గమ్మతి సంగతి ఏందంటే, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద కూడా సస్పెన్షన్ అస్త్రం పడింది. ఏంది సామీ ఇది? దేవుడి దర్శనానికి వెళ్లినా ఈ రూల్స్ వర్తిస్తాయా? గొడవను చూసి సస్పెండ్ చేశారా లేక పార్టీని చూసి సస్పెండ్ చేశారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
సభలో ప్రతిపక్షం లేనప్పుడు సీఎం సవాళ్లు విసిరిండు. స్టేడియంలో అవతలి జట్టు వాళ్లే లేనప్పుడు సింగిల్ వికెట్ మీద సెంచరీలు కొట్టినట్టుంది ఈ రాజకీయం! గల్లీలో కబడ్డీ ఆడుతూ.. ‘ఎదురెవడు లేడు, నేనే కింగ్’ అని గంతులు వేసిన చందంగా మారింది ఈ తతంగం. మిగతా పార్టీల వాళ్లయితే సస్పెన్షన్ చూసి భయపడ్డారో ఏమో, మొత్తం ప్రధాన ప్రతిపక్షం మీద సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ ఈ విషయంలో కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఓపిక ఉండాలె, ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇయ్యాలె. అంతేకానీ, లోపలికి రాకుండా అడ్డుకోవడం, వచ్చినోళ్లను, రానోళ్లను సస్పెండ్ చేయడం ఏందో తమాషా! ప్రజాస్వామ్యం పిల్లల అంటే ఆట కాదు, అందరి గొంతు వినిపించే వేదిక!