నల్లగొండ ప్రతినిధి, మే15 (నమస్తే తెలంగాణ) : నారట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడలో గల రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలి ఉన్న ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు జూన్ 5నుంచి 10వ తేదీ వరకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్‌క్రిష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వేలం నియమ నిబంధనలు, ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్లాట్లు, సెమీ ఫినిష్డ్ ఇండ్లకు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో భౌతిక వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు విడుతలుగా వేలం నిర్వహించామని, అందులో మిగిలిన 59 ఓపెన్ ప్లాట్లు, 209 పాక్షిక నిర్మాణ గృహాలకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ ప్లాట్లకు చదరపు గజానికి రూ.6వేలు, పాక్షిక నిర్మాణమైన ఇండ్లకు వాటి నిర్మాణ దశలను అనుసరించి చదరపు గజానికి 6వేల నుంచి రూ.10,500 అప్సెట్(కనిష్ట) ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ భౌతిక వేలంలో పాల్గొనే వారు 10వేల రూపాయల ఈఎండీ కలెక్టర్ పేరుతో చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు ప్రాజెక్టు కోఆర్డినేటర్ సయ్యద్ షఫీ 9154339209 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.