నల్లగొండ ప్రతినిధి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా ఏందంటే అది ఉమ్మడి నల్లగొండ జిల్లానే. కరువు కాటకాల నడుమ భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నా.. రైతులు బోరు, బావులపై ఎక్కువగా ఆధారపడి సాగు చేసేవారు. వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేకపోవడంతో పెద్ద సంఖ్యలో బోర్లు వేస్తూ బావులు తవ్విస్తూ నష్టాలపాలైనా సరే సాగును వదిలేవారు కాదు. ఈ క్రమంలో 2014లో స్వరాష్ట్రం ఏర్పడే నాటికి 2.90లక్షల పైచిలుకు వ్యవసాయ కనెక్షన్లతో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో లోఓల్టేజీ, వచ్చిరాని కరెంటుతో ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు మోటర్లు కాలిపోయి ఎక్కువగా నష్టపోయింది కూడా నల్లగొండ రైతాంగమే. దీనికితోడు రాత్రిళ్లు వచ్చిపోయే కరెంటుతో నిద్రలేని రాత్రులతో పాముకాట్లకు, కరెంటు షాక్‌కు గురైన రైతుల్లోనూ నల్లగొండే ముందుండేది. యాసంగిలో వరి, బత్తాయి, నిమ్మతోటలు ఎండడంతో కడుపు మండిన రైతులు కరెంటు సక్రమంగా ఇవ్వాలంటూ రోడ్లెక్కడం సమైక్య పాలనలో నిత్యం కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో అదంతా గతంగా మారింది. కరెంటు సరఫరా పట్ల కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధి, పట్టుదలతో నల్లగొండ జిల్లా వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోనే నిరంతర ఉచిత విద్యుత్‌తో అత్యధిక లబ్ధి పొందుతున్న జిల్లాగా నల్లగొండ అగ్రస్థానంలో నిలిచింది. ఇదంతా కేసీఆర్ చలువనేని జిల్లా రైతన్నలు ఘంటాఫథంగా చెబుతుండడం విశేషం.
ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో 2018 జనవరి 1నుంచి మొదలైన నిరంతర ఉచిత విద్యుత్‌తో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికే అత్యధిక మేలు జరిగింది. గత ఏడాది చివరి నాటికే మొత్తం 4.65 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏటికేడు పెరుగుతున్నా కరెంటు సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. నడి వేసవిలో సైతం నిత్యం 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు కొన్నేండ్లుగా విరామమెరుగక సాగులోనే బిజీగా గడిపారు. ఈ వేసవి కంటే ముందు గత ఏడాది చివరి వరకు కరెంటుతో పాటు పుష్కలంగా భూగర్భజలాలు అందుబాటులో ఉండడంతో వేసవిలో సైతం పుచ్చకాయలతోపాటు కూరగాయల సాగు పెద్ద ఎత్తున కొనసాగింది. సమైక్య పాలనలో వరి పంట కోశారంటే మళ్లీ నారుమళ్లు దున్నే వరకు రైతులు ఖాళీగా ఉండేవారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ఆ పరిస్థితి లేదు. గతంలో బత్తాయి, నిమ్మ, మామిడి తోటలకే నీళ్లు సరిపడక ట్యాంకర్లతో నీటిని అందించేవారు. కానీ.. కేసీఆర్ పాలనలో నిరంతర కరెంటుకు తోడు నీటి లభ్యతతో పండ్ల తోటల నుడుమ సైతం అంతర పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తూ వచ్చారు. అందుకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరానే కారణం. దీంతో 2023 చివరి నాటికి వ్యవసాయంలో ఎంత కష్టపడితే అంత సంపాదన అన్నట్లుగా రైతులు చెప్పుకొచ్చారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014లో వరి సాగు 4.50లక్షల ఎకరాలైతే ఉచిత కరెంటు, సాగునీటి లభ్యతతో 10లక్షల పైచిలుకు ఎకరాలకు పెరిగింది. ఇందులో నాన్ ఆయకట్టు ప్రాంతంలో పెరిగిన సాగు విస్తీర్ణం అధిక భాగం. వరితోపాటు నల్లగొండ జిల్లా బత్తాయి, నిమ్మ తోటలకు ప్రసిద్ధి. 1990 నుంచి విస్తరిస్తూ వచ్చిన బత్తాయి సాగు 2009 నుంచి క్షీణిస్తూ వచ్చింది. సరైన నీటి వసతితోపాటు అరకొర కరెంటుతో తోటలు ఎండిపోయాయి. పది, పదిహేను ఏండ్లు పెంచిన తోటలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు పెద్ద ఎత్తున బత్తాయి తోటలను తొలగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి బత్తాయి, నిమ్మ తోటలపై రైతులు ఆసక్తిని కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ.. రాష్ట్రం ఏర్పాటయ్యాక సాగునీటి వసతితోపాటు నిరంరత కరెంటుతో మళ్లీ రైతులు తోటల సాగుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. బత్తాయి, నిమ్మ తోటలకు తోడు మామిడి, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ ఆపిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు కూరగాయల సాగు సైతం విస్తృతమైంది. నిరంతర కరెంటుతో వేసవిలో సైతం ఎక్కడ చూసినా కూరగాయల సాగు కనిపించడం మొదలైంది. ఈ ఏడాది వేసవిలో కరువు పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో పండ్ల తోటలతోపాటు కూరగాయల సాగుపై దెబ్బపడింది. అయితే.. గతేడాది వరకు అందించిన నిరంతర విద్యుత్.. ప్రస్తుతం గ్రామాల్లో కొత్త సాగు పద్ధతులకు కారణంగా మారింది. గ్రామాల్లోని సాధారణ రైతులతోపాటు యువకులు, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు సైతం సాగుబడిలోకి వస్తున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. దీనంతటికీ అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధనే కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు. అట్లాంటి కేసీఆర్‌పైన, అప్పటి ఆయన సర్కార్పైన కరెంటు సరఫరాలో అక్రమాలంటూ అబాండాలు వేయడం సరికాదంటున్నారు. నిరంతర కరెంటుతో కేసీఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక ఇమేజ్ సాధించి పెట్టారనడంలో ఎవరికీ సందేహాలు లేవని ప్రజలే పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు పంటలను కాపాడుకునేందుకు కన్నకష్టాలు పడ్డాం. అప్పట్లో మడి పారిందాక అక్కడే ఉండేటోళ్లం. రాష్ట్రం వచ్చినంక కరెంటు సమస్యలు తీరిపోయాయి. కేసీఆర్ కరెంటు వచ్చిందని సంబురపడ్డాం. పంటలకు దర్జాగా ఎప్పుడంటే అప్పుడు నీళ్లు పెట్టుకున్నాం. ఆ సమస్య పోయిందంటే దానికి కేసీఆరే కారణం. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చినట్లు మరెవ్వరూ ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. లో ఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు, స్టార్టర్లు కాలిపోయేవి. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయానికి, పరిశ్రమల రంగానికి కోతలు లేకుండా కరెంటు ఇచ్చిండ్రు. అది ఓర్వలేక ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సరార్ కమిషన్ వేయడం, విచారణ జరుగక ముందే నిందలు వేయడం సరైంది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి మోసం చేసింది. వేళాపాల లేని కరెంటు కోతలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. రాష్ట్రం వచ్చినా విద్యుత్ సమస్యలు అలాగే ఉంటాయని చాలా మంది అన్నారు. కానీ.. తొలి సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గృహ అవసరాలకు కోతలు లేకుండా కరెంటు సరఫరా చేశారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి మోసం చేసింది. యాసంగిలో సాగుకు సరిగా కరెంటు ఇయ్యక రైతులు పంటలను ఎండపెట్టుకున్నారు. కేసీఆర్ అప్పుడున్న పరిస్థితుల ప్రకారమే విద్యుత్ రేట్లు చెల్లించారు తప్ప.. ఇందులో ఎలాంటి కుంభకోణం లేదు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను బదనాం చేసే కుట్ర చేస్తున్నది.
నేను చాలా కాలం నుంచి కార్పెంటర్ పనిచేస్తూ జీవనం గడుపుతున్నా. 2014కు ముందు కరెంట్ కష్టాలు అనుభవించాం. 2014 తర్వాత కేసీఆర్ పాలనలో నిరంతర నాణ్యమైన కరెంట్ అందివ్వడంతో చేతినిండా పని దొరకడంతో సుఖంగా జీవించాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు విధించడంతో పని లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెల్వకుండా ఉండడంతో కార్పెంటర్ వర్క్ చేయలేకపోతున్నాం. నా దగ్గర మరో ఐదుగురు కార్పెంటర్లు పని చేస్తుంటారు. కరెంట్ కోతలతో పని సరిగ్గా నడువక కూలీలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతర కరెంట్ అందించి ఆదుకుంటే.. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కరెంట్ కోతలతో కష్టాల పాల్జేస్తుండు.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్ల పాటు రైతులకు నిరంతర నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ సార్కే దక్కుతుంది. రైతు పక్షపాతిగా కేంద్రంపై కొట్లాడి సాగర్ నీటితో చెరువులు నింపి మండు వేసవిలో నిండుకుండలా కళకళలాడిన చెరువులు నేడు ఎండిపోయి బోసిపోయాయి. కరెంటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను శంకించడం సరైనది కాదు. మా సాగర్ నీటిని తరలించినా ఒక్కరూ నోరెత్తలేదు. ఇప్పుడు వానలు లేక, చెరువులో నీళ్లు లేక రైతులు ఆకాశం వైపు కోటి ఆశలతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.