నల్లగొండ, ఫిబ్రవరి 29 : గృహ వినియోగం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామని ఎన్నికల హామీల్లో ఊదరకొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత లేకుండానే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 27న ఆదరా బాదరాగా ప్రారంభించినా పథకం విధివిధానాలు ప్రకటించకపోవడంతో అర్హులు ఎవరనే విషయం అయోమయంగా మారింది. పథకాన్ని అమలుచేయాల్సిన అధికార యంత్రాంగానికి సైతం దీనిపై క్లారిటీ లేకపోవడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మందికే సబ్సిడీ గ్యాస్ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో జిల్లాలో ఎంతమందికి వస్తుంది, వచ్చే జాబితాలో తమ పేరు ఉంటుందా, అసలు ఏ ప్రామాణికంగా ఇస్తారు అనే ప్రశ్నలపై జనంలో చర్చ నడుస్తున్నది. నల్లగొండ జిల్లాలో 6.18 లక్షల మంది ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఉండగా.. అందులో మూడు లక్షల మందికి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీ గ్యాస్ కావాలని 4.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో మూడు లక్షల కుటుంబాలకు మించి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. కాగా, జిల్లాలో రేషన్ కార్డుదారులు 4.67 లక్షల మంది ఉన్నారు.
నల్లగొండ జిల్లాలో ప్రజాపాలన కింద మహాలక్ష్మి పథకంలో సబ్సిడీ వంట గ్యాస్ కోసం 4.60 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో మూడు లక్షల కుటుంబాలకు మించి మాహాలక్ష్మి పథకం వర్తించే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు కోసం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆయా పథకాలు కావాలని జిల్లాలో 5.35 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రధానంగా సబ్సిడీ గ్యాస్ కోసం 4.60 లక్షల కుటుంబాలు అప్లికేషన్లు పెట్టుకున్నాయి. అయితే.. సబ్సిడీ గ్యాస్ కావాలంటే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో దరఖాస్తుదారుల్లో కొంత మంది అనర్హతకు గురికానున్నాయి.
ఇక దరఖాస్తులో గ్యాస్ నెంబర్ వేయని వారు, ఒకే గ్యాస్ నెంబర్ అన్నాదమ్ములు, తల్లిదండ్రుల, కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు వేసిన వారిలో ఎవరు అర్హులో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక ప్రాంతంలో గ్యాస్ నెంబర్ ఉండి ఉపాధి పొందుతున్న మరో ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తారా.. లేదా? అనే దానిపై అధికారులకే క్లారిటీ లేదు. దీంతోపాటు ఆదార్ నెంబర్ కూడా ట్యాలీ కావాల్సి ఉంది. ఇన్ని కొర్రీల మధ్య సబ్సిడీ గ్యాస్‌కు ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో ఒకసారి గ్యాస్ బుక్ చేసుకుంటే గానీ తెలియని పరిస్థితి.
డీబీటీ పద్ధతిలో సబ్సిడీ ఇస్తున్నామని.. మీ బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బు వేస్తామని చెప్పి దశాబ్ద కాలంగా వినియోగదారులను కేంద్రం చేస్తున్న దగా తెలిసిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.974 ఉండగా.. రూ.46.88 సబ్సిడీ రూపంలో వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కేంద్ర సర్కార్ చెబుతున్నప్పటికీ అది ఖాతాల్లో పడుతుందో, లేదో తెలియని పరిస్థితి. ఇదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించి మొదటగా వినియోగదారులే చెల్లించి గ్యాస్ తీసుకుంటే ఆ తర్వాత రూ.500 పోను మిగిలిన సబ్సిడీ ఖాతాల్లో వేస్తామని ఊదరగొడుతున్నది. ఈ సబ్సిడీ ఎప్పుడు వేస్తారో.. ఎలా వేస్తారో ముందుముందు తెలుస్తుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను మూడేండ్ల కాలాన్ని సగటుగా తీసుకొని ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మూడేండ్లలో ప్రాంతాలు మారినప్పుడు గ్యాస్ కనెక్షన్ మార్చకుండా ఇతరుల పేరు మీద తెచ్చుకున్నవారు, మరే ఇతర పద్ధతుల్లో తీసుకున్న వాళ్లకు సబ్సిడీలో కోతలు పడవచ్చు.