రామగిరి, జూన్ 1: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే …మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే బడిబాటతో పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తీవ్రమైన కృషి చేస్తారు. అలాంటి సందర్భంలో ..అనాలోచిత, అశాస్త్రీయ విధానంతో పిల్లలు తక్కువగా ఉన్నారనే ఉద్దేశం తో టీచర్లను వేరే పాఠశాలలకు సర్దుబాటు చేయడం సరైనదికాదని ఓవైపు ఎస్జీటీ టీచర్లు, మరోవైపు ప్రధా న ఉపాధ్యాయ సంఘాలు సర్కార్, అధికారుల వైఖరిని తప్పుబడుతున్నాయి.
సర్దుబాటు ప్రక్రియ ఈనెల 19లోగా చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. సర్కార్ నిర్ణయం ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని, తక్షణమే ఉత్తర్వులు సవరణ చేసి ప్రాథమిక విద్యతోపాటు పాఠశాలలను పరిరక్షించుకోవాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. బడులు ప్రారంభమైన మరుసటి రోజే కాకుండా జూలై చివరి వారం, ఆగస్టులో సర్దుబాటు ప్రక్రియ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ, విద్యాశాఖ అనాలోచిత వైఖరితో 298 ప్రాథమిక పాఠశాలలు 2019 నుంచి 2025 విద్యా సంవత్సరం ముగింపునాటికి మూతపడిన విషయం విదితమే. తాజాగా సర్కార్ నిర్ణయంతో ఇంకా పాఠశాలలు మూతపడే అవకాశం ఉండటంతోపాటు గ్రామీణ, పల్లె ప్రాంతాల్లోని బడీడు పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని టీచర్లు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. పాఠశాలలు మొదలైన మరుసటి రోజే పిల్లలు తక్కువ ఉన్న పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఫ్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించనుండగా దానితో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. మరో వైపు ఉపాధ్యాయులంతా బడిబాట విజయవంతం చేసి, సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. బడిబాట ముగిసిన తర్వాత జూలై చివరి వారం, ఆగస్టులో ఉపాధ్యాయుల సర్దుబాటు చేస్తే బాగుంటుందని టీచర్లు పేర్కొంటున్నారు.
ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికీ ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండాలని టీచర్ల సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఉపాధ్యాయులను నియమించడం సరికాదు. ఇలాంటి అశాస్త్రీయ, అసంబద్ధ నిర్ణయాలతో ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నది. ప్రతి పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని సాక్షాత్తూ విద్యాకమిషన్ సూచించింది. ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులుంటే పాఠాలు ఎలా బోధిస్తారు. అలాకాకుండా సర్కార్, విద్యాశాఖ …..పుండు ఒకచోట ఉంటే ..మందు మరోచోట రాస్తున్నట్లు ఉన్నది.
– పి.వెంకులు, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ
ఫ్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే బడిబాటలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి పిల్లల నమోదుకు ప్రయత్నిస్తుంటే…అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేసేలా టీచర్ల సర్దుబాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం విరమించుకోవాలి. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే టీచర్లు ఉంటేనే పిల్లలను తల్లిదండ్రులు పంపిస్తారు. పిల్లలు చేరిన తర్వాత అప్పటి పరిస్థితుల ఆధారంగా టీచర్ల సర్దుబాటు చేస్తే బాగుంటుంది. జూన్లో పాఠశాలలు తెరువగానే మరసటి రోజే సర్దుబాటు చేయాలనే ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం. అలాకాకుండా జూలై చివరివారం లేదా ఆగస్టులో చేస్తే బాగుంటుంది.
– కాళం నారాయణరెడ్డి, పీఆర్టీయూటీఎస్, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ