
నీలగిరి: నల్లగొండ పట్టణంలో సుమారు రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణాన్ని అన్నిరంగాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రూ.9 కోట్ల సాధారణ నిధులు, రూ.8.40 కోట్ల పట్టణ ప్రణాళిక నిధులు, రూ.68 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, రూ.63 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు, రూ.2.71 కోట్ల గ్రాస్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొ న్నారు. ఇవేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

పట్టణంలో రోడ్ల వెడల్పు పనులు జరుగుతున్నందున కౌన్సిలర్లు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరా రు. అనంతరం పారిశుధ్యం, తాగునీరుపై చర్చించారు. సమావేశంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు పిల్లి రామ రాజు, బోయినపల్లి శ్రీనివాస్, ఖయ్యూంబేగ్, మారగోని భవానీగణేశ్, పర్వత్ ఫర్జానా ఇబ్రహీం, ఆలకుంట్ల రాజేశ్వరీ మోహన్‌బాబు, యామ కవిత పాల్గొన్నారు.