బొడ్రాయిబజార్, ఆగస్టు 28 : కొన్నేండ్లుగా టైలర్ వృత్తిని కొనసాగిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుండగా సొంతంగా మిషన్ కొనుగోలు చేసుకోలేని నిస్సాహాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలిచారు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి. ‘కార్మికులు కార్మికులుగా ఉండొద్దు సొంతంగా మిషన్ పెట్టుకోవాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలి’ అని టైలర్ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా కరెంట్‌తో నడిచే జూకీ కుట్టు మిషన్లను అందజేసి వారి కండ్లల్లో ఆనందం నింపారు. గతంలో మేరు కులస్తులకు 135 మిషన్లు పంపిణీ చేయగా ఆదివారం టైలర్ కార్మికుల విజ్ఞప్తి మేరకు రూ.47,70,850 వ్యయంతో మరో 215 జూకీ కుట్టు మిషన్లను మంత్రి అందజేశారు. ఒక్కో జూకీ మిషన్ సుమారు 22 వేలు ఉంటుంది. దాంతో గత 30 నుంచి 40 సంవత్సరాలుగా పలు పెద్ద టైలర్ దుకాణాల్లో కార్మికులుగా పని చేస్తున్న టైలర్లంతా నేడు యజమానులయ్యారు. ఈ నేపథ్యంలో వారు ఇంటి నుంచే ఆర్డర్లు తెచ్చుకొని సొంతంగా బట్టలు కుట్టి ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి ఈ మిషన్లు ఉపకరించనున్నాయి.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా వృత్తి కార్మికులుగా వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వృత్తిదారులకు అన్ని విధాలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. వివిధ రకాల వృత్తిదారులకు ప్రభుత్వం పింఛన్లు, అధునాతన యంత్రాలు, పరికరాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. టైలరింగ్‌ను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రభుత్వ సహకారంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. 350మంది టైలర్లకు కుట్టుమిషన్లు ఇవ్వడంతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేకత సంతరించుకున్నది. మంత్రి జగదీరెడ్డి తోడ్పాటుతో తాము కార్మికుల నుంచి యజమానులమయ్యామని మిషన్లు పొందిన కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టైలర్లనుగుర్తించింది మంత్రి జగదీశ్‌రెడ్డే
నా 30 ఏండ్ల టైలర్ జీవితంలో ఏ ప్రజా ప్రతినిధి టైలర్లను పట్టించుకోలేదు. మా పరిస్థితిని చూసిన మంత్రి జగదీశ్‌రెడ్డి అడిగిన వెంటనే జూకీ మిషన్లు అందజేసిండు. ఇప్పుడు ఈ మిషన్లతో కార్మికులుగా ఉన్న మేము యజమానులమయ్యాము. మాకు ఇంత చేసిన ఆయనకు రుణపడి ఉంటాం. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం.
-రవ్వ రాంబాబు, టైలర్, సూర్యాపేట
పక్షవాతం వచ్చింది, మిషన్ తొక్కలేను..
నేను 40సంవత్సరాలుగా టైలర్ వృత్తి చేస్తున్నా. 12 ఏండ్ల క్రితం పక్షవాతం వచ్చి చేయి పడిపోయింది. అయినప్పటికీ కుటుంబ పోషణకు తప్పక ఇంటి నుంచే పీస్ వర్క్‌లు చేస్తున్నా. మిషన్ తొక్కలేను. నన్ను గుర్తించిన మంత్రి జగదీశ్‌రెడ్డి 25వేల విలువ చేసే జూకీ మిషన్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ మిషన్‌తో నాకు ఆర్థిక భరోసా ఏర్పడింది.
– యలగందుల ఆంజనేయులు, టైలర్, సూర్యాపేట
జూకీ మిషన్లతో పని సులువవుతుంది
నేను సూర్యాపేటలో ఓ పెద్ద టైలర్ దుకాణంలో టైలర్ కార్మికుడిగా పని చేస్తున్నా. నాకు వచ్చే కొద్దిపాటి ఆదాయం పిల్లల చదువులు, కుటుంబ పోషణకే సరిపోతుంది. సొంతంగా మిషన్ కొనుగోలు చేయలేక కార్మికుడిగానే కాలం గడుపుతున్నా. మంత్రి జగదీశ్‌రెడ్డి మా పాలిట వరంలా వచ్చిండు. అడిగిందే తడవుగా మాకు కరెంట్‌తో నడిచే కుట్టు మిషన్లు ఇచ్చిండు. దీనివల్ల పని సులువవుతుంది. మంత్రి జగదీశ్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.
-చేపూరి గోపి, టైలర్, సూర్యాపేట