శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 15, 2020 , 01:28:39

నేడు ‘సహకార’ పోలింగ్‌

నేడు ‘సహకార’ పోలింగ్‌

నీలగిరి : జిల్లాలో శనివారం సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధ్ద్దం చేశారు. జిల్లాలో మొత్తం 42సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 6న రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. 42 సహకార సంఘాల్లోని 545 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఆలగడప, దామరచర్ల, వెనిగండ్ల సహకార సంఘాలతోపాటు, 177డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 368 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 368 స్థానాలకు 846 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

3డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ఏర్పాటు..

జిల్లాలో 3 డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేవరకొండ డివిజన్‌లో 12సహకార సంఘాల పరిధిలోని 129 డైరెక్టర్‌ స్థ్ధానాలకు దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయం, నల్లగొండ డివిజన్‌లో 14 సహకార సంఘాల పరిధిలోని 119 డైరెక్టర్‌ స్థ్ధానాలకు  డైట్‌ ప్రాంగణం, మిర్యాలగూడ డివిజన్‌లో 13సహకార సంఘాల పరిధిలోని 120 డైరెక్టర్‌ స్థ్ధానాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌కు సామగ్రి అందజేసి నిర్ణీత పోలింగ్‌ కేంద్రానికి పంపారు. శనివారం వారు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు.

11రూట్లుగా విభజన...

39 సహకార సంఘాల పరిధిలోని 368 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లను దేవరకొండలో 3, నల్లగొండ, మిర్యాలగూడలో 4 రూట్లను ఏర్పాటు చేసి ప్రతి రూట్‌కు జోనల్‌, రూట్‌ అధికారులను నియమించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారి ఇద్దరు అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులను కేటాయించారు. మొత్తం 1104 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు 10శాతం అదనంగా మరో 110 మంది సిబ్బందిని, 22 మంది జోనల్‌, రూట్‌ అధికారులను నియమించారు. 74,882 బ్యాలెట్‌ పత్రాలను  ముద్రించారు. 601 బ్యాలెట్‌ బాక్సులనూ సిద్ధ్దం చేశారు. 

74,882 మంది ఓటర్లు...

జిల్లాలో 42 సహకార సంఘాల పరిధిలోని 546 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆయా సంఘాల పరిధిలో 1,08,955 మంది ఓటర్లు ఉన్నటుల గుర్తించారు. వీరిలో 79,661 మంది పురుషులు, 29,294 మంది స్త్రీలున్నారు. కాగా 3 సహకార సంఘాలు, 177 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఈ సంఘాల పరిధిలోని ఓటర్లు ఓటు వేయడం లేదు. మిగిలిన 39 సహకార సంఘాల పరిధిలో 368 డైరెక్టర్‌ స్థానాలకు 74,882 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 

రేపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక....

ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు నిర్ణీత పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది పోలింగ్‌ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికైన డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎంపిక చేయనున్నారు. ఆ రోజు కోరం లేకపోయినా అనివార్య కారణాలతో వాయిదా పడినా మరుసటి రోజు ఉదయం తిరిగి ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.  


logo