మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 29, 2020 , 03:52:05

‘అక్షరాస్యత’పై రీసర్వే..

‘అక్షరాస్యత’పై రీసర్వే..

నల్లగొండ జిల్లాలో అక్షరాస్యత శాతం తగ్గినట్టు పంచాయతీరాజ్‌శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. 12,37,008మంది జనాభాలో 1,73,688 మంది(14శాతం) నిరక్షరాస్యులున్నట్లుగా తేల్చింది. ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌' పేరుతో పల్లె ప్రగతిలో ఈ నెల 2నుంచి 11వరకు నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఫలితాల నిర్ధారణకు ఎంపీడీఓల ఆధ్వర్యంలో మరోసారి సర్వే చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. గ్రామాల్లో వచ్చిన ఫలితాలను పాత రికార్డులతో పోల్చనున్నారు.

  • జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో ఎంపీఓల ఆధ్వర్యంలో పూర్తిస్థాయి గణన
  • తర్వాత గత రికార్డులతో పోల్చి తేడా గుర్తింపు
  • గత సర్వేలో అత్యధిక నిరక్షరాస్యులున్న జిల్లాగా నల్లగొండ గుర్తింపు
  • 1.73లక్షల మంది ఉన్నట్లు నిర్ధారణ
  • నిరక్షరాస్యుల్లో అత్యధికం మహిళలే

నల్లగొండ, నమస్తే తెలంగాణ : పల్లెల్లో నిరక్షరాస్యత రూపుమాపేందుకు 18ఏళ్లకు పైబడిన చదువుకోని వారిని గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ అధికారులు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు , బీఎల్‌ఓలు, ఇతర సిబ్బంది సహకారంతో ఈ నెల 2నుంచి 11వరకు ‘ఈచ్‌ వన్‌-టచ్‌ వన్‌' కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యుల జాబితా పరిశీలిస్తే నల్లగొండ ముందు వరుసలో ఉంది. దీంతో మరోసారి పలు గ్రామాల్లో రీసర్వే చేయాలని సర్కార్‌ జిల్లా అధికారులకు సూచించింది. పంచాయతీ శాఖ అధికారులు ఎంపీఓల ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో కొన్ని కాలనీల్లో మరోసారి సర్వే చేసి నిరక్షరాస్యులను గుర్తించనున్నారు. వీరికి విద్యాశాఖ సహకారంతో చదువు చెప్పి అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో ఉంది. 


గుర్తించిన గ్రామాల్లో రీసర్వే...

జిల్లా వ్యాప్తంగా 844గ్రామ పంచాయతీలుండగా ఆయా గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతిలో భాగంగా ఈ నెల 2నుంచి 11వరకు పంచాయతీశాఖ అధికారులు ఈచ్‌ వన్‌-టచ్‌ వన్‌ గుర్తించిన నిరక్షరాస్యులు రాష్ట్రంలోనే నల్లగొండలో అత్యధిక మంది ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో మరోసారి జిల్లాలోని కొన్ని గ్రామాలను గుర్తించి వాటిలో రీ సర్వే చేయనున్నారు. ప్రధానంగా గుర్తించిన గ్రామాల్లో దళిత వాడల్లో ఈ సర్వే చేపట్టి గత సర్వేను ప్రస్తుత సర్వేతో పోల్చి ఎంత మంది నిరక్షరాస్యుల సంఖ్య పెరిగిందా.? తగ్గిందా అన్న కోణంలో ఆరా తీయనున్నారు. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగనుంది. దీని ఆధారంగా గత రికార్డుల్లో హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకుని మరోసారి నిరక్షరాస్యుల గుర్తింపునకు సర్వే జరుగనుంది. 


జిల్లాలో 1.73 లక్షల మంది నిరక్షరాస్యులు...

జిల్లా వ్యాప్తంగా 844గ్రామ పంచాయతీల్లో 12, 37,008 మంది జనాభా ఉంది. వీరిలో 1,73,688 మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించగా మహిళలు 1,15,172 మంది పురుషులు 58,489 మంది ఉన్నా రు. ఈ నెల 2నుంచి 11వరకు జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించారు. అత్యధికంగా మిర్యాలగూడలో 11,562 మంది నిరక్షరాస్యులు ఉండగా అత్యల్పంగా చిట్యాలలో 2119 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం నిరక్షరాస్యులు ఉండగా అందులో 9శాతం మహిళలు, 5శాతం పురుషులు. 18సంవత్సరాలు పైబడిన వారిని ఈచ్‌వన్‌-టచ్‌వన్‌ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులుగా గుర్తించారు. 


అక్షరాస్యులుగా మార్చేందుకే..

డిజిటల్‌ యుగంలోనూ నిరక్షరాస్యత ఉండటం సర్కారుకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి కనీస అక్షరజ్ఞానం నేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా పల్లెల్లో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉన్నందున వారిని గుర్తించి అక్షరాస్యులగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. విద్యాశాఖతో పాటు స్థానిక మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థల సహకారంతో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చనున్నారు. నూతన పంచాయతీ చట్టం రూపొందించి పల్లెలను పూర్తిస్థాయిలో అభివృద్ధ్ది చేసేలా చర్యలు తీసుకున్న సర్కార్‌ అక్షరాస్యతపైనా దృష్టి పెట్టింది.


గుర్తించిన గ్రామాల్లో మరోసారి సర్వే చేస్తాం..

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2నుంచి 11 వరకు జిల్లా వ్యాప్తంగా 844 గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించాం. ఆయా గ్రామాల్లో 1,73, 688 మంది ఉన్నట్లు తేలింది. వీరి జాబితాను పంచాయతీ శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేశాం. నల్లగొండలో ఎక్కువ మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించడంతో ఏదైనా పొరపాటు జరిగిందా.? అనే కోణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని గ్రామాల్లో రీ సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తాం. 

-విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి


logo