సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 8 : రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కనీసం 20శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ (టీఎస్ఈసీ) నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్ని రంగాలతోపాటు విద్యారంగానికి ప్రా ధాన్యమిస్తామని, బడ్జెట్లో 15శాతం నిధులు కేటాయిస్తామని ప్రకటించిందన్నారు.
ఇప్పుడు 7శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. అప్పుల కారణంగా ఆర్థిక లోటు ఏర్పడిందని, విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయించామని, భవిష్యత్లో నిధులు పెంచుతామని ప్రకటించుకున్నారని చెప్పారు. కానీ.. ఎంత శాతం పెంచుతామన్నది చెప్పలేదని, ఈ నెలలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, కొచ్చర్ల వేణు, నాయకులు రేపాక లింగయ్య, వెంకటేశ్వర్రావు, వెంకటనారాయణ, రమణ, సింహాద్రి, క్రాంతికుమార్ పాల్గొన్నారు.