నందికొండ, సెప్టెంబర్ 15 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతున్నది. గురువారం 3,81,698 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా.. ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల ద్వారా 2,66,310 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పాటు కుడికాల్వకు 9,443, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,232, ఎస్ఎల్బీసీకి 2400, వరద కాల్వకు 400 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590(312 టీఎంసీ) అడుగులు కాగా ప్రస్తుతం 588.90 (308.7614 టీఎంసీ) అడుగులు ఉంది.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు గురువారం 6,539.11 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్ల ద్వారా 3,786.23 క్యూసెక్కులు, కుడి కాల్వకు 276.31, ఎడమ కాల్వకు 236.84 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 642.70 అడుగులు (3.87 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.
అడవిదేవులపల్లి : టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 2,95,542 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగినట్లు ఇన్చార్జి ఏడీ కె. నరసింహారావు తెలిపారు. దాంతో ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,98,537 క్యూసెక్కుల నీటిని దిడువకు విడుదల చేసినట్లు చెప్పారు. టెయిల్‌పాండ్ నీటి నిల్వ సామర్థ్యం సుమారు 7.080 టిఎంసీలు కాగా ప్రస్తుతం 5.573 టీఎంసీలు ఉన్నట్లు పేర్కొన్నారు.