
మాల్, డిసెంబర్ 17 : చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఇటీవల జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే నిందితుడు దారుణానికి ఒడిగట్టినట్లు నాంపల్లి సీఐ సత్యం తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా పలు రాష్ర్టాలో నిందితుడు చోరీలు, హత్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. శుక్రవారం చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన షేక్ బడేమియాకు (అలియాస్ రఫిక్) 11 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మృతి చెందాడు. నాటి నుంచి వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇటీవల చింతపల్లిలో సాగర్-హైదరాబాద్ రోడ్డు వెంట ఉన్న సాయిబాబా ఆలయం సమీపంలో మతి స్థిమితం లేకుండా చిత్తు కాగితాలు సేకరించే వృద్ధుడు సత్తయ్య (60) వద్ద ఉన్న డబ్బులు లాక్కొనేందుకు ప్రయత్నించాడు. వృద్ధుడు ప్రతిఘటించడంతో మద్యం మత్తులో పొడిచి హతమార్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. శుక్రవారం మండల కేంద్రం లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడి విచారించగా గతంలో పలు చోరీ కేసులు, మూడు హత్యలు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు.