మిర్యాలగూడ, జూలై 13 : మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం పోలీసులు రూ.35లక్షలు విలువ చేసే 140.585 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నెల 12న మిర్యాలగూడ పట్టణ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహేంద్ర బొలేరోతోపాటు మహేంద్ర మేరాజో వాహనాలను తనిఖీ చేసే క్రమంలో అందులో ఉన్న నలుగురు పోలీసులను చూసి పారిపోతుండగా ఒకరిని పట్టుకున్నారు. వాహనాల్లో తనిఖీ చేయగా 140.585 కిలోల గంజాయి లభ్యమైంది.
పట్టుబడిన భూక్యా రామును విచారించగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి చెందిన నూనావత్ జగన్, నూనావత్ మంద్యానాయక్ సూచనల మేరకు ఒక వాహనం హైదరాబాద్ నుంచి, మరో వాహనం సూర్యాపేట నుంచి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్లే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని లోడ్ చేసుకొని రవాణా చేస్తున్నట్లు తెలిపాడు. గంజాయి రవాణాలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి చెందిన మరి కొంతమంది ఉన్నట్లు తెలిపాడు.
కాగా, పెన్‌పహాడ్ మండలం బంజారాహిల్స్‌కు చెందిన నూనావత్ జగన్, జలమాల్కుంట తండాకు చెందిన నూనావత్ మంచ్యానాయక్, లాల్‌సింగ్‌తండాకు చెందిన ఆంగోతు నాగరాజు, ఖమ్మం జిల్లా జుబ్లీపురాకు చెందిన బానోతు సాయిలు పరారీలో ఉండగా పెన్‌పహాడ్ మండలం లాల్‌సింగ్‌తండాకు చెందిన భూక్యా రామును పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిపై కేసు నమోదు చేసి పట్టుబడిన గంజాయిని, రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచామని, వాటి రవాణా, వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు.
యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, సేవించే వారి గురించి తెలిస్తే 100 ద్వారా లేదా నేరుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పోలీసులకు సహకరించి మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో గంజాయిని, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వన్ టౌన్ సీఐ సుధాకర్‌ను, హాలియా సీఐ జనార్దన్, హాలియా ఎస్ఐ సతీశ్, మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ రవి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.