నేరేడుచర్ల/సూర్యాపేట అర్బన్/నాంపల్లి, ఆగస్టు 22 : చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితులు అనుకూలించక కొంత మంది మధ్యలోనే ఆపేసి బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్(టాస్) ద్వారా అవకాశం కల్పించింది. అలాంటి వారు వయస్సుతో సంబంధం లేకుండా చదువును కొనసాగించడానికి 1991లో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని ప్రారంభించింది. 2008-09లో ఓపెన్ పదో తరగతి, 2010-11 విద్యా సంవత్సరంలో ఓపెన్ ఇంటర్మీడియట్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇచ్చే ధ్రువపత్రం రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానం. ఓపెన్ స్కూల్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు, యువజనులు పోటీ పరీక్షల్లో సైతం రాణించి జీవితంలో స్థ్ధిరపడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని చాలా మంది అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. చదుకోవాలనే శ్రద్ధ ఉన్నవారు ఈనెల 31లోపు అపరాద రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యాబోధన ఇలా
వివిధ కారణాలతో మధ్యలోనే చదువును ఆపేసిన వారు, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం, ఉద్యోగం ఉన్నప్పుటికీ పదోన్నతి పొందలేని వారికి, ఏర్పాటు చేసిందే తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెనల్ సూల్ సోసైటీ). ఓపెన్ టెన్త్ పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్, ఇతర డిప్లొమో కోర్సులకు, ఇంటర్ పూర్తి చేసిన వారు ఎంసెట్, డైట్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాసుకునే అవకాశంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ప్రతి ఆదివారం, రెండో శనివారం, ఇతర ప్రభుత్వం సెలవు రోజుల్లో ఏడాదికి 30 రోజులకు మించకుండా తరగతులు ఉంటాయి. అభ్యర్థ్ధులు తప్పనిసరిగా కనీసం 20 తరగతులకు హాజరుకావాలి. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. కొంచెం కష్టపడి చదివితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
మూడు గ్రూపులు
ఓపెన్ టెన్త్, ఇంటర్ బోధనా విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏ-లో బాషలు, బీ-లో ప్రధాన సబ్జెక్టులు, సీ-లో వృతి విద్య కోర్సులు ఉంటాయి. చదువుకునే వారు వారి ఇష్టానుసారం సబ్జెక్టులను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. వృతి విద్య కోర్సును ఓ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. అదనపు సబ్జెక్టులను ఎంచుకొని చదువుకోవచ్చు. వీటికి సంబంధించిన వివరాలు ఆయా అధ్యయన కేంద్రాల్లో లభిస్తాయి.
అర్హులు ఎవరంటే ?
పదో తరగతిలో చేరే విద్యార్థ్ధులకు 31-8-2023 నాటికి 14 యేండ్లు నిండి ఉండాలి. 15 యేండ్లు నిండి పదో తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్లో చేరవచ్చు. ఇంటర్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ, ఫీజీ తదితర కోర్సులు చేసేందుకు వీలుంది.
ఫీజు వివరాలు ఇలా ..
ఓపెన్ స్కూల్లో చేరాలనే ఆసక్తి ఉన్న వారు ఈవిధంగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి పరీక్షల్లో చేరే వారు ఏవరైనా తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 150 చెల్లించాలి. తరువాత అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి, అన్ని వార్గల స్త్రీలకు రూ. 1000 చెల్లించాలి. అపరాద రుసుము రూ. 100తో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో చేరే వారు ఏ వర్గానికి చెందిన వారైన తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300 చెల్లించాలి. అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరి పురుషులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని వర్గాల స్త్రీలు రూ. 1200 చెల్లించాలి. అపరాద రుసుము రూ. 200 చెల్లించి ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు పూర్తయిన తర్వాత సంబంధిత ధ్రువపత్రాలను తీసుకోని వెళ్లి అధ్యయన కేంద్రంలో అధ్యాపకులకు అందించాలి.
పదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు ఇలా..
పదో తరగతి చేరే వారు ఆన్లైన్లో ఫీజు చెల్లించిన అనంతరం ఫీజు చెల్లించిన రసీదు, ధ్రువపత్రంతో పాటు పుట్టిన తేదీ కోసం గతంలో చదివిన పాఠశాల నుంచి రికార్డు సీటు లేదా టీసీ లేదా మన్సిపల్ అధికారి, తాసీల్దార్ జారీ చేసిన జనన ధ్రు వీకరణపత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫోర్టు సైజ్ ఫొటోలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు కుల ధ్రువీకరణ ప్రతం దరఖాస్తుకు జత చేయాలి.
ఇంటర్లో ప్రవేశానికి..
పదో తరగతి పాస్ అయిన మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పోర్టు సైజ్ ఫొటోలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు కుల ధ్రువీకరణ ప్రతం జత చేసి దరఖాస్తు చేసుకోవాలి.
చదువుకోవాలనే వారికి మంచి అవకాశం
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనందున చదువును మధ్యలో ఆపేసిన వారు తిరిగి చదువుకోవడానికి మంచి అవకాశం. ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు సద్వినియోగ ంచేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఉన్నది. వెంటనే దరఖాస్తు చేసుకోని మీ పరిధిలోని స్టడీ సెంటర్లో అందించాలి. పుస్తకాలను సైతం ఉచితంగా అందిస్తాం.
-జలగం జగదీశ్ కుమార్ ఓపెన్ స్కూల్ సూర్యాపేట జిల్లా కో ఆర్డినేటర్