నల్లగొండ, మే 25 : పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ కేటాయించి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న కోచింగ్ సెంటర్లకే నిధులివ్వకుండా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ఏడాదిన్న కింద అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఎస్సీ వెల్ఫేర్ శాఖను తన వద్దనే పెట్టుకోవటంతో దళిత అభ్యర్థులు ఉచిత శిక్షణకు దూరం అవుతున్నారు. ఫలితంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లకు ప్రిపరేషన్ కావడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రెండు బ్యాచ్‌ల చొప్పున పది నెలలపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11స్టడీ సర్కిళ్లలో 2,200 మందికి ఫౌండేషన్ కోర్సు పేరుతో ఉచిత శిక్షణ, వసతి కల్పించారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్న కాలంగా ఒక్క బ్యాచ్ కూడా నిర్వహించకపోవడం, గత సర్కార్ హయాంలో నిర్వహించిన బ్యాచ్‌లకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో ఆయా జిల్లా ల సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్ల చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతియేటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయా శాఖల్లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఆయా ఉద్యోగాలకు ప్రిపరేషన్లో భాగంగా శిక్షణ తీసుకుంటారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వం ఆయా వర్గాల వారీగా సంబంధిత స్టడీ సర్కిళ్లల్లో ఉచితంగా శిక్షణ ఇస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 11 బీసీ, 11 ఎస్సీ, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ స్టడీ సర్కిళ్లల్లో శిక్షణ ఇస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ ఏటా ఆయా స్టడీ సర్కిళ్లలో ఈ ఉచిత శిక్షణ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, మైనార్టీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు నడుస్తున్నప్పటికీ ఎస్సీ స్టడీ సర్కిళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ తన వద్ద ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఉంచుకోవడం, నిధులు ఇవ్వకపోవడంతో ఆయా సర్కిళ్లు ఉత్సవ విగ్రహాల్లా మారి మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి.
రాష్ట్రంలో నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వాటిల్లో ఫౌండేషన్ కోర్సు పేరుతో ప్రతియేటా రెండు బ్యాచ్‌లు (ఒక బ్యాచ్ ఐదు నెలలు)ప్రభుత్వం నిర్వహిస్తుంది. భవనం అద్దె, ఫ్యాకల్టీ, మెస్, ఉద్యోగులు, ఇతర నిర్వహణ ఖర్చులకు ప్రతి అభ్యర్థికి బ్యాచ్‌కు సుమారు రూ.2,400 చెల్లిస్తుంది. ఈ భారాన్ని తప్పించుకోవడానికి సీఎం రేవంత్ ఈ స్టడీ సర్కిళ్లను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత సర్కార్ హయాంలో నిర్వహించిన బ్యాచ్‌లకు డబ్బులు కూడా ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో అద్దెల కోసం బిల్డింగ్ ఓనర్స్, మెస్ బిల్స్ కోసం కాంట్రాక్టర్స్, జీతాల కోసం ఉద్యోగులు, ఫ్యాకల్టీ, సంబంధిత శాఖ ఉద్యోగులు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతూ లెటర్లు పెడుతున్నారు. సీఎం దగ్గరకు వెళ్లి అడిగే ధైర్యం సంబంధిత అధికారులకు లేకనే బిల్లులు రావడం లేదని బిల్డింగ్స్ ఓనర్స్, మెస్ కాంట్రాక్టర్స్ అంటున్నారు.