నల్లగొండ, ఆగస్టు 01 : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఒక్క జూలై నెలలో 90 కేసుల్లో 106 మంది బాల కార్మికులను రెస్క్యూ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో ఎస్పీ నేతృత్వంలో పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, ఇతర విభాగాల అధికారుల సమన్వయంతో టీమ్ లుగా ఏర్పడి ఒక్క జూలై నెలలోనే 106 మంది పిల్లలను రెస్యూ చేశారు. వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఎక్కువగా బీహార్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎస్పీ అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలలతో పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్ 100 లేదా 1098 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని పేర్కొన్నారు.