రామగిరి, మే 22 : నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, చరిత్రకారుడు, సిలివేరు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు సిలివేరు లింగమూర్తి తన వ్యక్తిగత గ్రంథాలయం నుండి సాహిత్య చారిత్రక ప్రాధాన్యత కలిగిన సుమారు 1,000 గ్రంథాలను సూర్యాపేటలోని పిల్లలమర్రి పినవీరభద్ర గ్రంథాలయానికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. తాను జీవిత కాలంలో సంపాదించుకున్న ఈ విలువైన పుస్తకాలు భవిష్యత్ తరాలకు అందాలంటే పిల్లలమర్రి పినవీరభద్ర కళాపీఠం గ్రంథాలయం ద్వారానే సాధ్యమని భావిస్తున్నట్లు తెలిపారు. పరిశోధకులకు, పోటీ పరీక్షార్థులకు ఉపయోగపడే విలువైన గ్రంథాలు అందజేసిన సిలివేరు లింగమూర్తికి గ్రంథాలయం నిర్వాహకుడు శీల అవిలేను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సృజన సాహితీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాగర్ల సత్తయ్య పాల్గొన్నారు.