చండూరు, జూలై 07 : రోజుకు 10 గంటల పని విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ జీఓ నంబర్ 282 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చండూరు మండల కేంద్రంలో జీఓ ప్రతులను ప్రజా సంఘాల నాయకుడు బండ శ్రీశైలం నేతృత్వంలో దగ్థం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయాన్ని కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు, ప్రజా సంఘాలు, ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సర్కార్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పయనిస్తుందన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ చేయడానికి, కట్టు బానిసలుగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెగ ఆరాటపడుతుందని విమర్శించారు.
44 కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా అమల్లోకి వస్తే కార్మికులకు కనీస ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సెలవులు వంటి అనేక అంశాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న, కలుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు జేరిపోతుల ధనంజయ, సలువోజు రామలింగాచారి, నాంపల్లి జగదీశ్, మోగుదాల వెంకటేశ్వర్లు, లింగయ్య, మున్సిపాలిటీ కార్మికులు నాగరాజు, యాదగిరి, రైతు సంఘం నాయకులు బుచ్చిరెడ్డి, రాఘవేంద్ర, పగిళ్ల మధు, సైదులు పాల్గొన్నారు.