నందికొండ, నవంబర్ 15: నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో పిల్లలకు ఇచ్చిన ఇంజెక్షన్లు వికటించడంతో 10 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల వార్డులో 21 మంది పిల్లలు విష జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. శుక్రవా రం రాత్రి 9 గంటల సమయంలో 17మంది పిల్లలకు నర్సులు యాం టీ బయాటిక్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న 10 మంది పిల్లలను తల్లి దండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి ఇంజెక్షన్ తీసుకున్న పిల్లలకు గంట వ్యవధిలో తల నొప్పులు, వాంతులు, కడుపునొప్పి, చలి, వణుకుతోపాటు శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వచ్చాయి. దీంతో దవాఖానలోని సిబ్బంది, డాక్టర్లు ఇంజెక్షన్లు వికటించాయని గమనించి రాత్రి 11 నుంచి ఉదయం 3 గంటల వరకు అత్యవసర వైద్య సేవలను అందజేశారు. ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత ఇంటికెళ్లిన పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని కూడా దవాఖానకు రప్పించి వైద్య సేవలు అందజేశారు. ఈ విషయం లో డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
కమలా నెహ్రూ ఏరియా దవాఖానను అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ సందర్శించారు. పిల్లల వార్డులో అందించిన వైద్య సేవలపై ఆరా తీసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న పిల్లలను పరిశీలించి, వారి తల్లిదండ్రులను దవాఖానలో అందజేసిన వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలోని డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన పిల్లలను, వారికి అందించిన వైద్యసేవల తీరును పరిశీలించామని పిల్లల ఆరోగ్య పరిస్థితి ఫర్వాలేదని, ఎటువంటి ప్రాణాపాయం లేదన్నారు. ఈ విషయమై విచారణ చేపట్టి బాధ్యులైన డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు:ఎమ్మెల్యే
రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి అన్నారు. హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరి యా దవాఖానలో ఇంజెక్షన్ వికటించి అస్వస్థతకు గురైన పిల్లలను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలన్నారు.
ఎటువంటి లోపం లేకుండా వైద్యసేవలందిస్తున్నాం..
శుక్రవారం రాత్రి పిల్లలకు అందిచిన వైద్యంలో ఎటువంటి లోపం లేదు. అనుభవం ఉన్న డాక్టర్ల సూచనల మేరకే నర్సులతో పిల్లలకు ఇంజెక్షన్లు ఇప్పించాం. పిల్లలకు ఇచ్చిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కాలం చెల్లినవి కావు. పిల్లలు అస్వస్థతకు గురైనట్లు గమనించగానే వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర సేవలు అందించాం. ఇంటికెళ్లిన పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి దవాఖానకు రప్పించి వైద్యసేవలు అందించాం. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగుంది.
– డీసీహెచ్‌వో మాతృనాయక్