యాదాద్రి, నవంబర్ 11 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం జరిపారు. హోమంలో పాల్గొంటే భూతపేత పిశాచాల బాధలు తొలగిపోతాయని ఇలలోక సుఖాలు, పరలోక మోక్షాలు సిద్ధిస్తాయని ఆలయ ప్రధానార్చకుడు మరింగంటి మోహనాచార్యులు తెలిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు.
కార్తిక మాసం సందర్భంగా కొండ కింద వ్రత మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 510 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్తిక మాసం దీపారాధన పూజల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు.
ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. స్వామి వారిని సుమారు 23వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.25,00,940 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
సంకష్ట హరచతుర్ది పురస్కరించుకుని యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. గణపతి అష్టోత్తరం, మూలమంత్ర హవనం నిర్వహించారు. ఆర్జిత పూజల్లో భాగంగా పలువురు భక్తులు గణపతి హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో శివాలయ ప్రధానార్చకుడు గౌరీభట్ల నర్సింహరాములు శర్మ, ఏఈఓ రఘుబాబు, సహాయ అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు. కార్తిక మాసం సందర్భంగా అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు.
శ్రీవారిని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గుగులోతు శంకర్‌నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,98,450
వీఐపీ దర్శనాలు 1,05,000
బ్రేక్ దర్శనాలు 1,34,700
వేదాశీర్వచనం 10,200
సుప్రభాతం 4,100
ప్రచార శాఖ 53,550
వ్రత పూజలు 4,08,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 54,800
ప్రసాద విక్రయం 10,44,550
వాహనపూజలు 11,000
అన్నదాన విరాళం 30,464
శాశ్వత పూజలు 12,700
సువర్ణ పుష్పార్చన 65,716
యాదరుషి నిలయం 70,560
పాతగుట్ట నుంచి 51,350
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 12,500
లీసెస్ 33,300