ఈ ఫొటోలో ఉన్న బిల్లు యజమాని పేరు కొడపర్తి కనకయ్య. గుండాలలో లాండ్రీషాపు నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నెలకు రూ.400- 500 వరకు బిల్లు వస్తున్నది. మే నెల కరెంట్ బిల్లు జనరేట్ చేయగా.. ఏరియర్స్‌తో కలిపి మొత్తం రూ.9,909 వచ్చింది. గతంలో ప్రభుత్వం నెలనెలా డబ్బులు చెల్లించడంతో జీరో బిల్లు మాత్రమే వచ్చేది. కానీ, కాంగ్రెస్ సర్కారు పట్టించుకోపోవడంతో బిల్లు భారీగా పెరిగిపోయింది. ఇది ఒక్కరి సమస్య మాత్రమే కాదు.. జిల్లాలో వేలాదిమంది రజకులదీ ఇదే పరిస్థితి.
యాదాద్రి భువనగిరి, జూన్ 13(నమస్తే తెలంగాణ) : రజక, నాయీబ్రాహ్మణులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. సెలూన్లు, ధోబీఘాట్, లాండ్రీ షాపులకు సర్కారు కరెంట్ బిల్లులు చెల్లించడంలేదు. బీఆర్ఎస్ హయాంలో నెలనెలా ఠంచనుగా చెల్లించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా కట్టలేదు. దీంతో రజక, నాయీబ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల చెల్లింపు కోసం ఆయా వృత్తిదారులు సర్కారుపై ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.
కేసీఆర్ హయాంలో ఠంచన్‌గా జమ..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు సమప్రాధాన్యం కల్పించింది. కులవృత్తులకు బాసటగా నిలిచింది. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి గురైన నాయీబ్రాహ్మణులు, రజక వృత్తులకు జీవం పోసింది. సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత కరెంట్ పథకానికి శ్రీకారం చుట్టింది. నెలకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అందించింది. దీనికి అయ్యే ఖర్చును 2021 నుంచి మొత్తం ప్రభుత్వమే భరించింది. నెలనెలా జీరో బిల్లులు మాత్రమే వచ్చేవి. దీంతో లబ్ధిదారులు సంతోషంగా తమ వృత్తులు చేసుకునేవారు. విద్యుత్ వినియోగం 250 యూనిట్లు దాటితే అదనపు వినియోగానికి అయ్యే బిల్లు లబ్ధిదారుడే భరించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా బిల్లులు చెల్లించలేదు. జీరో బిల్లుకు బదులు నెలనెలా అమౌంట్‌తో బిల్లులు జారీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి వేలల్లో బిల్లులు వస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3,500 సెలూన్లు ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 800వరకు ఉన్నాయి. వీరంతా ఉచిత కరెంట్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో నాయీబ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక శాతం సెలూన్లు అద్దె షాపుల్లోనే కొనసాగుతున్నాయి. వేలల్లో బిల్లులు వస్తుండటంతో చెల్లించాలంటూ యజమానులు ఒత్తిడి పెంచుతున్నారు. షాపు ఖాళీ చేయమని స్పష్టంచేస్తున్నారు. ఇక బిల్లులు పెరిగిపోవడంతో చెల్లించాలంటూ పలుచోట్ల విద్యుత్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు దుకాణాల అడ్రస్‌లు మార్చుకున్నప్పుడు కొత్త కనెక్షన్లు సైతం ఇవ్వడం లేదు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది రజకులు ఉండగా, యాదాద్రి జిల్లాలో 3,500 మంది ఉచిత కరెంట్ పొందుతున్నారు. లాండ్రీ నడిపితేనే జీవనం గడుస్తుంది. ఒక్కో షాపునకు నెలకు రూ.500 నుంచి రూ.1500 వరకు బిల్లులు వచ్చేవి. దీంతో నెలనెలా బిల్లులు చెల్లించడం భారంగా మారేది. బిల్లులు తడిసిమోపడయ్యేవి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రీ కరెంట్‌ను అమలుచేసి ఊరట కల్పించింది. విద్యుత్ మీటరు, స్విచ్ బోర్డు, వైరింగ్తోపాటు కనెక్షన్ ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించినా.. విడుదల చేయకపోవడంతో సమస్య జటిలమైందని ఆయా కులసంఘాల నేతలు చెబుతున్నారు. ఇక ఉచిత విద్యుత్ కమర్షియల్ కేటగిరీ ఎల్టీ-2లో ఉండటంతో యూడీఎస్, ఎల్డీసీ, అదనపు లోడ్ చార్జీల పేరుతో యూజర్ చార్జీలు వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.