రామగిరి, జనవరి 2 : విద్యార్థుల శాస్త్రీయ నైపుణ్యాలను ప్రదర్శించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు వేళయ్యింది. శుక్ర, శనివారం జరిగే సైన్స్‌ఫెయిర్‌కు నల్లగొండలోని సాగర్‌రోడ్డులో గల డాన్‌బాస్కో పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘సుస్థిర అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పాత్ర ’ అనే ప్రధాన అంశంతో జరిగే కార్యక్రమంలో 7 ఉప అంశాలలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలతోపాటు డీఈడీ, బీఈడీ కళాశాలల ఛాత్రోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ ప్రాజెక్టులు, బోధనోపకరణాలను ప్రదర్శించనున్నారు.
వీటితోపాటు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్స్‌స్పైర్ మనక్ 113 ప్రాజెక్టులను కూడా ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు హాజరుకానున్నారు. సైన్స్ ఫెయిర్‌కు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు అన్ని వసతులు కల్పించారు. ప్రదర్శన రిజిస్ట్రేషన్ సమయంలోనే అల్పాహారం, భోజన టోకెన్లతో పాటు ఐడీ కార్డులను అందజేస్తారు.
జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను గురువారం డీఈఓ బి.భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతితోపాటు పలువురు పరిశీలించారు. వారి వెంట డీసీబీసీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, వివిధ కమిటీల సభ్యులు, ఎంఈఓలు, జీహెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రాజెక్టులను ఈ నెల 7, 8, 9లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్రస్థాయి ప్రదర్శనకు పంపిస్తారు.