గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 29, 2020 , 02:15:05

ఇక పట్టణ ప్రగతి

ఇక పట్టణ ప్రగతి

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మున్సిపాల్టీల్లో ఇక అభివృద్ధి పరుగులు పెట్టనుంది. మున్సిపాల్టీలుగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగడంతో ఇక్కడి ప్రజలు అభివృద్ధికై కొత్త పాలకవర్గంపై ఆశలు పెంచుకొన్నారు. ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరుతాయనే నమ్మకంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం పట్టణాల్లో అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నది. ప్రస్తుతం పాలకవర్గానికి వేసవి కాలం ప్రథమ ప్రాధాన్యత కానుంది. ఎండాకాలం రావడంతో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టనున్నారు. పట్టణ కేంద్రాల్లో మిషన్‌ భగీరథ పూర్తిస్థాయిలో పూర్తి కాకపోవడంతో బోర్లు, పైపులైన్లు మరమ్మత్తులు, కొత్తగా లైనింగ్‌ వేయించడంపై దృష్టి సారించనున్నారు. కొత్త పురపాలికల్లో తొలి సమావేశంలో ఇదే తొలి ఎజెండా కానుంది. దీనికి తోడు గ్రామ పంచాయతీల మాదిరి పట్టణాల్లోనూ ప్రగతి కార్యాచరణ అమలు కానుంది. పంచాయతీల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంచడంతో పాటుగా వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. పట్టణాల్లోనూ ఇదే తరహాలో చర్యలు తీసుకోనున్నారు. నాగర్‌కర్నూల్‌లో డంపింగ్‌ యార్డును మార్చాలని ప్రజలు కోరుతున్నారు. దీన్ని మార్చేందుకు ఎమ్మెల్యే మర్రి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి ప్రతి నెలా ప్రభుత్వం కొరత లేకుండా నిధులను మంజూరు చేస్తుంది. సమస్యలపై వచ్చే ప్రజలకు తగిన విధంగా పనులు చేపట్టేలా ఉద్యోగుల్లో జవాబుదారీతం పెంచేలాకామన్‌ మున్సిపల్‌ సర్వీస్‌ను అమలు చేయనున్నారు. దీనివల్ల ప్రజలకు తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకం పెరుగుతుంది, ఉద్యోగుల్లోనూ ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించనున్నారు. వార్డుల్లో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి వార్డులో నాలుగు కమిటీల నియామకం జరగనుంది. ఇందులో మహిళ, యూత్‌, సీనియర్‌ సిటిజన్స్‌, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల సమన్వయంతో ఆయా వార్డుల్లో చేపట్టే పనులపై ముందుకు సాగుతారు. దీనివల్ల పనులపై పారదర్శకత పెరుగుతుంది. ఎలాంటి తప్పులు దొర్లే అవకాశం ఉండదు. అదే విధంగా ఏండ్ల తరబడిగా మారని ఇంటి నెంబర్లు త్వరలో మారబోతున్నాయి. ఇంతకు ముందున్న పట్టణాలకు మున్సిపాల్టీగా మార్చిన తరుణంలో పలు గ్రామాలు విలీనం అయ్యాయి. దీంతో ఒకే పట్టణంగా మార్చేందుకు ఇంటి నెంబర్ల మార్పు తప్పనిసరి అవుతుంది. అలాగే పట్టణాల్లో జనావాసాలు పెరగడంతో పాతవి శిథిలమవ్వడంతో పాటుగా వందలాది కొత్త భవనాలు నిర్మాణమయ్యాయి. దీనివల్ల పాత ఇండ్లకు నెంబర్లు అలాగే ఉన్నాయి. కొత్త ఇండ్లకు మాత్రం ఆపై నెంబర్లు కేటాయిస్తున్నారు. దీన్ని సమూలంగా మార్చివేసి కొత్తగా చేపట్టిన వార్డుల ప్రకారంగా ఇంటి నెంబర్లు ఇస్తారు. పట్టణాల్లో అభివృద్ధికి ప్రధానం ఆస్తి పన్ను. ఏండ్ల తరబడిగా ఈ పన్నును పెంచలేదు. అయితే అదే క్రమంలో సేవల్లో ప్రగతి పెరిగింది. దీంతో ఆస్తి పన్నును స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలకవర్గాలు ఈ ఆస్తి పన్ను పెంపుపై త్వరలో తీర్మానాలు చేస్తాయి. ఇక నూతన పాలకవర్గానికి మున్సిపల్‌ శాఖ కొత్త మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పించనుంది. కార్యవర్గ విధులతో పాటుగా నిధులు, బాధ్యతల గురించీ వివరిస్తారు. ఫిబ్రవరిలోనే దీనిపై అవగాహన సదస్సు జరగనుంది. తొలిసారిగా ఎన్నికలు జరిగిన కొల్లాపూర్‌ మున్సిపాల్టీలో పరిపాలన పట్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. మొత్తం మీద ప్రభుత్వం మున్సిపాల్టీల్లో మెరుగైన సేవలను పారదర్శకంగా అందించేందుకు చర్యలు చేపట్టడంతో పుర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు 

మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలకు అవసరమైన సలహాలను ప్రభుత్వం అందించనుంది. పట్టణాల్లో ప్రస్తుతం వేసవి కావడం వల్ల మంచినీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశంతో మున్సిపల్‌ శాఖ ఉత్తర్వుల మేరకు త్వరో ఆస్తి పన్ను పెంపు, వార్డు కమిటీల ఏర్పాటు, ఇంటి నెంబర్ల కేటాయింపు, పట్టణ ప్రగతిలాంటి పనులు చేపడతాం. ప్రజలు తప్పకుండా ఆస్తిపన్నను చెల్లించాలి. పట్టణాల్లో అభివృద్ధి జరగాలంటే ఆస్తి పన్ను ముఖ్యం. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే చర్యలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం. కొత్త పాలకవర్గానికి పూర్తి స్థాయిలో మున్సిపల్‌ అధికారులు, ఉద్యోగులు సహకారంగా ఉంటారు. ప్రజలు కూడా పాలకవర్గం, అధికారులకు సహకరించాలి.


logo