గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 19, 2020 , 01:34:20

షావలీకి గంధోత్సవం

షావలీకి గంధోత్సవం
  • -రంగాపూర్‌లో వైభవంగా ఉర్సు
  • -వేలాదిగా తరలివచ్చిన ముస్లింలు
  • -ఫాత్యాల్‌ సమర్పించిన భక్తులుఅచ్చంపేట రూరల్‌ : మండల పరిధిలోని రంగాపూర్‌ నిరంజన్‌ షావలీ దర్గా ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. శనివారం ప్రారంభమైన దర్గా ఉత్సవాలకు కుల, మతాలకు అతీతంగా వేలాది సంఖ్యలో భక్తులు కందూర్లు చేసి, దర్గాలో నిరంజన్‌ షావలీకి పాతేహా సమర్పించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాదీ జనవరి 17 సాయంత్రం నుంచి మొదలయ్యే ఉత్సవాలకు నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేటతో పాటు నల్గొండ, గుంటూరు, కర్నూలు మొదలైన జిల్లాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఉర్సు ఉత్సవాలు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని దర్గా కమిటీ అధ్యక్షుడు అమీనోద్దీన్‌ స్పష్టం చేశారు.

 ఉమామహేశ్వర క్షేత్రంలో ముస్లిం మహిళల పూజలు
శ్రీశైల ఉత్తర ద్వారముగా పేరుగాంచిన ఉమామహేశ్వర క్షేత్రం కుల, మతాలకు అతీగంగా మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం గవ్యాంత పూజలు, అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన, రుద్రాభిషేకం, రుద్రహోమం, సాయ మౌపాసన, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలు, నంది వాహన సేవ, మృగయాత్ర, వినోదం, నీరాజన మంత్ర పుష్పం మొదలైన పూజలు నిర్వహించినట్లు అర్చకులు వీరయ్య శాస్త్రి పేర్కొన్నారు. క్షేత్రంలో హిందూ, ముస్లింలు సమానంగా ఉమామహేశ్వరుడికి పూజలు నిర్వహించి తమ మొక్కలను తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన చైర్మన్‌ సుధాకర్‌, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్‌రావులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రంగాపూర్‌ ఉర్సు జాతరకు సమీపంలోనే ఉమామహేశ్వరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎస్సైలు ప్రదీప్‌కుమార్‌, విష్ణు, రమేశ్‌, రాజు, వీరబాబు తదితరులు ఉన్నారు.logo