రంగుల ప్రపంచపు రారాణిగా వెలుగొందిన నటి మాధురీ దీక్షిత్. 1980-90లలోని కుర్రకారు కలల రాకుమారి ఆమె. అందంతోపాటు అద్భుతమైన నృత్యాభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అలాంటి అగ్రతారతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి స్టార్‌హీరోలు సైతం ఆసక్తి చూపించేవారట. కానీ, తోటి హీరోయిన్లు మాత్రం వెనకడుగు వేసేవారట. మాధురీతో పోటీ పడలేకనే ఆమెతో కలిసి నటించడానికి అంగీకరించేవారు కాదట. ఈ విషయాన్ని మరో స్టార్ హీరోయిన్ ‘కరిష్మా కపూర్’ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందులోనూ షారుక్ ఖాన్ హీరోగా 97లో వచ్చిన ‘దిల్ తో పాగల్ హై’లో మాధురీతో తెరను పంచుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. అప్పటి స్టార్హీరోయిన్లు మనీషా కోయిరాలా, జూహీ చావ్లా, కాజోల్, రవీనా టాండన్ లాంటివాళ్లంతా ఆ సినిమా ఆఫర్‌ను వదులుకున్నారని వెల్లడించింది.
అయితే, ఈ సినిమాలో మరో కీలకపాత్రలో మెరిసింది కరిష్మా. తాను కూడా మొదట్లో ఈ సినిమాను తిరస్కరించినట్లు తెలిపింది. “90లలో మాధురి దీక్షిత్‌తో తెరను పంచుకోవడానికి అప్పటి హీరోయిన్లు భయపడ్డారు. మ్యూజికల్ – డ్యాన్స్ ఎంటర్టైనర్గా వచ్చిన ‘దిల్ తో పాగల్ హై’ ఆఫర్‌ను మొదట్లో నేను కూడా తిరస్కరించాను. అయితే.. నాకు మాధురితో ఎలాంటి శత్రుత్వం లేదు. ఆమె నృత్య నైపుణ్యాలకు తగ్గట్టుగా.. నా ప్రదర్శన ఉండలేదనే భయంతోనే నో చెప్పా! చివరికి స్క్రిప్ట్ చదివిన తర్వాత.. నా మనసు మార్చుకున్నా!” అని కరిష్మా చెప్పుకొచ్చింది. నిజానికి తాను మాధురీ దీక్షిత్‌కు పెద్ద అభిమానిననీ, ‘ఏక్ దో తీన్…’ నుంచే ఆమెను ఆరాధించానని వెల్లడించింది.
“యష్ చోప్రా, ఆదిత్య చోప్రా మళ్లీ మళ్లీ అడగడం, స్క్రిప్ట్ కూడా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పా! మా అమ్మ ప్రోత్సాహంతోనే.. సవాలుతో కూడిన నృత్య సన్నివేశాల్లో మాధురీతో పోటీపడ్డా! ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘దిల్ తో పాగల్ హై’ నా కెరీర్లోనే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్‌గా నిలిచింది” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. ఈ ఐకానిక్ చిత్రానికి యష్ చోప్రా దర్శకత్వం వహించాడు. షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ.9 కోట్లతో తెరకెక్కిన ‘దిల్‌తో పాగల్ హై’ ప్రపంచవ్యాప్తంగా రూ. 71 కోట్లు కొల్లగొట్టింది. 97లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతోపాటు అనేక అవార్డులనూ అందుకున్నది.