అమ్మ ఆకాంక్షను నెరవేర్చడానికి ఎనిమిదేళ్ల ప్రాయంలోనే నటనా రంగంవైపు అడుగులేసింది. చదువుకుంటూనే నటనలోనూ రాణిస్తూ రంగస్థలంపై కాలుమోపింది. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘కళ్యాణ వైభోగమే’తో తెలుగువారికి మరింత చేరువైంది నటి మేఘన లోకేశ్. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. నూతన సంవత్సరం కానుకగా జీ తెలుగులో ‘చామంతి’గా ముస్తాబై వస్తున్న మేఘన ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
మాది మైసూరు. మా అమ్మకు నటన అంటే ఇష్టం. నన్ను ఎంతగానో ప్రోత్సహించేది. నాకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో యాక్టింగ్ స్కూల్లో చేర్పించింది. మా గురువుగారు మండ్య రమేశ్. ఆయన కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ‘నటన రంగస్థలం’ అనే ఒక నాటక అకాడమీ స్థాపించి ఆసక్తి ఉన్నవారికి నటనలో శిక్షణ ఇస్తుండేవారు. ఆయన దగ్గరే నటనలో మెలకువలు నేర్చుకున్నా. కన్నడలో వచ్చిన దేవి సీరియల్ నా మొదటి ప్రాజెక్ట్. పవిత్ర బంధన, పురుషోత్తమ అనే మరో రెండు సీరియల్స్ కూడా చేశాను.
దాదాపు మూడేండ్ల తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది. 2014లో‘ శశిరేఖా పరిణయం’ సీరియల్ తెలుగులో నా మొదటి ప్రాజెక్ట్. తర్వాత జీ తెలుగులో ‘కళ్యాణ వైభోగమే’ సీరియల్లో డ్యూయల్ రోల్ చేశాను. దాదాపు ఆరు సంవత్సరాలు ప్రసారమైన ఆ సీరియల్ చాలా సక్సెస్ అయ్యింది. ‘రక్తసంబంధం’, ‘కళ్యాణం కమనీయం’ సీరియల్స్‌లోనూ నటించాను. ‘చామంతి’ జీ తెలుగులో నా నాలుగో ప్రాజెక్ట్. కెరీర్ మొదట్లో ఒకేసారి రెండు ప్రాజెక్టులు చేస్తుండేదాన్ని. ఇప్పుడు ఒకటే చేస్తున్నా. బుల్లితెర జర్నీ పదేండ్లు పూర్తయ్యాక కొంత గ్యాప్ తీసుకున్నా. అభిమానులకు ఇష్టపడే పాత్ర చేయాలని మంచి కథ కోసం వెయిట్ చేశాను. నా నిరీక్షణకు తెరదించుతూ ‘చామంతి’ రూపంలో మంచి పాత్ర నన్ను పలకరించింది.
తొలినాళ్లలో తెలుగు భాష రాక చాలా ఇబ్బందిపడ్డా. కొన్నిసార్లు నా వల్ల షూట్ లేటవుతుంది ‘నేను చేయలేను వెళ్లిపోతాన’ని కూడా అన్నాను. డైలాగులు ఇంగ్లిష్‌లో రాసుకొని చెప్పేదాన్ని. తర్వాత కొంచెం కొంచెం అర్థమైంది. మెల్లగా తెలుగు మీద పట్టు సాధించాను. భాష తెలిస్తే భావం అర్థమవుతుంది. భావం తెలిసినప్పుడు మరింత లీనమై డైలాగ్ చెప్పగలుగుతాం. నటుడు ప్రదీప్ గారి కుమార్తె నిహారిక రాయపర్తికి కన్నడ కూడా వచ్చు. ప్రతి డైలాగ్‌ను నాకు కన్నడలో అర్థమయ్యేలా చెప్పి తెలుగు నేర్పించింది. తెలుగు అనగానే నిహారికనే గుర్తొస్తుంది.
మా నాన్న లోకేశ్ గారు నాకు స్ఫూర్తి. నటనలో నాకు మోటివేషన్ మా గురువుగారే. ఆయన నేర్పిన విద్యతోనే ఈ స్థాయికి రాగలిగాను. నన్ను ఎంతగానో ఆదరించిన తెలుగువారి కోసం మరిన్ని మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను. మావారు స్వరూప్ భరద్వాజ్. పెండ్లికి ముందునుంచే ఆయనతో పరిచయం ఉంది. నా కెరీర్ గురించి మావారికి తెలుసు. ఆయన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందన్న నమ్మకం వచ్చాకే పెండ్లి చేసుకున్నా. కెరీర్ ప్రారంభంలో మా అమ్మానాన్న ఎంత మద్దతిచ్చారో.. ఇప్పుడు మావారు కూడా అంతగానే ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో అయామ్ లక్కీ అని చెప్పొచ్చు.
సీరియల్స్‌లో చేస్తూనే ఒక సినిమాలో నటించాను. హీరోయిన్గా ‘ఇది మా ప్రేమ కథ’ అనే సినిమా చేశాను. తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ, అప్పటికే సీరియల్స్‌తో బిజీగా ఉండటంతో ఒప్పుకోలేదు. నిజానికి నాకు సినిమాలకంటే సీరియల్స్‌లో నటించడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే సినిమాలకు కొన్ని నెలలపాటు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా విడులయ్యాక కొన్నాళ్లు మాత్రమే ప్రేక్షకులు చూస్తారు. సీరియల్స్ అయితే రోజూ తప్పకుండా చూస్తారు. అంతేకాకుండా నేను ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు చాలామంది ‘నువ్వు ఫలానా సీరియల్ చేశావు కదా?’ అని అడిగారు. అంటే సీరియల్స్ చేసిన వాళ్లను సినిమాల్లో తీసుకోరని అర్థమైతర్వాత ప్రయత్నాలు చేయలేదు. నిజానికి సీరియల్స్‌లోనే ఆర్టిస్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని నా అభిప్రాయం.
– హరిణి