శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Jan 24, 2020 , 02:01:29

సాహితీ పోకడలపై సమగ్ర చర్చలు

సాహితీ పోకడలపై సమగ్ర చర్చలు
  • - మూడు రోజుల పాటు ప్రదర్శనలు
  • - సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న విద్యారణ్య పాఠశాలలో ఫెస్ట్‌
  • - ముఖ్య అతిథిగా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ఆదూర్‌ గోపాలకృష్ణన్‌
  • - ఆస్ట్రేలియా నుంచి 13 మంది హాజరు

  నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో :  హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం (హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌, హెచ్‌ఎల్‌ఎఫ్‌) నేటి నుంచి ప్రారంభం కానుంది.  ఈ వేడుక  రచయితలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు, పండితులు, ప్రచురణకర్తలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. ‘హెచ్‌ఎల్‌ఎఫ్‌ 2020’ను ‘హైదరాబాద్‌ లిటరరీ ట్రస్ట్‌' తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, అనేక విద్యా, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, ప్రచురణ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నది. 2010లో ప్రారంభమైన ఈ ఉత్సవం దేశ సాంస్కృతిక క్యాలెండర్‌లో ఒక ప్రధానమైన వేడుకగా అవతరించింది. 
హెచ్‌ఎల్‌ఎఫ్‌  వేడుక గత పదేండ్లుగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా చర్చలు, సంభాషణలు, ప్యానెల్‌ చర్చలు, రీడింగులు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు, పుస్తక ప్రయోగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాశాల విద్యార్థులు, పాఠశాలల పిల్లల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 సుస్థిర సమాజ  నిర్మాణం కోసం..

   సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడానికి సాహి త్యం ప్రధాన భూమికను పోషిస్తున్నది. సాహిత్యం, కళలు, సంస్కృతి, వారసత్వ సమ్మేళనాలు, కళాత్మకమైన ఉత్సవాలను జరుపుకోవడం ద్వారా సౌందర్యాత్మకమైన, స్థిరమైన సమాజాన్ని సృష్టించాలని ‘హెచ్‌ఎల్‌ఎఫ్‌' కోరుకుంటుంది. ప్రతి జీవికి పర్యావరణ స్పృహతో కూడిన పండుగ ఉండాలని హెచ్‌ఎల్‌ఎఫ్‌ ఆశిస్తున్నది.
    ఔత్సాహికులకు మార్గదర్శనం
  ప్రతి రోజూ హెచ్‌ఎల్‌ఎఫ్‌ వేదికపై ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థులు, కవులు, రచయితలు, కళాకారులు, పాఠకుల చుట్టూ పలు రకాల లిటరరీ కార్యక్రమాలు కొనసాగుతాయి. వీరందరిని ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ ఔత్సాహికులకు ఈ ఉత్సవం మార్గదర్శనం చేస్తున్నది. సాహిత్యం, కళలు, సంస్కృతిపై లోతైన అధ్యయనం జరుగుతున్నది.  కళా రంగాలపై కార్యక్రమాలు, చర్చా వేదికలు కొనసాగుతాయి. ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు, వివిధ రంగాలకు సంబంధించిన ఆవిష్కరణలకు చోటు లభిస్తున్నది.

హెచ్‌ఎల్‌ఎఫ్‌ విధానం...

స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనే భావనలపై ప్రయత్నాలు కొనసాగాలి. అలాంటి ఆలోచన, కార్యదక్షతలను ప్రోత్సహించి, వాటికి మద్దతును ప్రకటించాలి. అన్ని రకాల సాహిత్యం, దృశ్య కళలు, సంస్కృతి, వారసత్వానికి ఒక వేదికను ఏర్పాటు చేసి, సమాజంలో సౌందర్యాన్ని ఆరాధించి, దానిని ప్రోత్సహించాలి. అందరికి సమాన అవకాశాల్ని కల్పించి, తోటి వారిని ఆదరించాలి. లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉన్నా దానిపై ఓర్పుతో వ్యవహరిద్దాం. పర్యావరణ అనుకూలతల వైపు అడుగులు వేద్దాం. ఆ దిశలో పండుగ చేసుకునేందుకు కృషి చేద్దాం. ప్లాస్టిక్‌ల వాడకాన్ని తగ్గించుకుందాం. వస్తు సామగ్రిని పునర్వినియోగం, రీ సైకిల్‌ యొక్క విశ్వసనీయతను అమలు చేసేలా హెచ్‌ఎల్‌ఎఫ్‌ విధానం కొనసాగుతోంది.

అతిథి దేశం: ఆస్ట్రేలియా

సాహిత్యం, కళలు, సంస్కృతిని ప్రదర్శించడానికి ఒక విదేశాన్ని ఆహ్వానించడం హెచ్‌ఎల్‌ఎఫ్‌ ప్రత్యేకత . హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ 2020లో ‘ఆస్ట్రేలియా’పై  దృష్టి సారిస్తున్నది.  ఆస్ట్రేలియా నుంచి 13 మంది వివిధ రంగాలకు చెందిన నిఫుణులు రానున్నారు. ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ (చెన్నై)  సుసానే గ్రేస్‌ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవుతారు.

మలయాళంపై ప్రత్యేక దృష్టి

భారతీయ భాష  మలయాళంపై ఈ దఫా హెచ్‌ఎల్‌ఎఫ్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ వేడుక ప్రతి ఎడిషన్‌లో ఒక భారతీయ భాషపై హెచ్‌ఎల్‌ఎఫ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. హెచ్‌ఎల్‌ఎఫ్‌ 2020లో మలయాళంపై దృష్టి సారించి ఆ భాష తీరు తెన్నులను సందర్శకులకు ప్రత్యేకంగా ఆవిష్కరిస్తూ, తెలియజేయనున్నది.

సరికొత్త అనుభూతి

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ అనే భావన నగరవాసికి ఒక సరికొత్త అనుభూతిగా మిగలాలి. సాహిత్యం, సంస్కృతి, విద్యా, సాంకేతిక కళా రంగాల్లో మనం ఎక్కడున్నామనే అవగాహన ప్రతి ఒక్కరికీ రావాలి.  ఈ వేడుకకు వచ్చే వారికి మంచి పుస్తకాలు, ప్రదర్శనలు, టాక్‌ షోలు, నాటకాలు, పాటలు మొదలైన వాటిని హృదయాలకు హత్తుకునేలా తీసుకొస్తున్నాం. సందర్శకుల వాహనాలకు లుంబినీ పార్కు వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశాం. పార్కింగ్‌ నుంచి సందర్శకుల కోసం ఉచితంగా షటిల్‌ బస్సులను పాఠశాల వరకు, లక్డీకపూల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఉచితంగా షటిల్‌ బస్సులను ఏర్పాటు చేశాం.
       - అజయ్‌ గాంధీ, డైరెక్టర్‌, హెచ్‌ఎల్‌ఎఫ్‌ అండ్‌ ట్రస్టీ

logo