దుబ్బాక, జూలై 17: విద్యార్థులు చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓపక్క ఉన్నత విద్యలో రాణిస్తూ మరోపక్క వ్యవసాయ పనుల్లో ముందుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండుగ చేస్తే… సీఎం కేసీఆర్ సర్కారు అదే వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. కాళేశ్వరంతో బీడుభూములు సైతం సాగుభూములుగా మారాయి. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గడ్, బీహార్‌లకు చెందిన వలస కూలీలు మన వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు వస్తున్నారు. చదువుతో పాటు వ్యవసాయంపై మక్కువతో పలువురు విద్యార్థులు వ్యవసాయ పనుల్లో రాణిస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. వ్యవసాయమంటే చిన్నచూపు కాదని.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలంటూ సగౌరవంగా చెబుతూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. వలస కూలీల కంటే వేగంగా వరినాట్లు వేస్తూ తమకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. దుబ్బాకలో పలువురు యువత ఓపక్క విద్యనభ్యసిస్తూ మరోపక్క వ్యవసాయ పనులు చేస్తూ చదువుకయ్యే ఖర్చులను సంపాదించుకుంటున్నారు.
వ్యవసాయ పనులపై ఆసక్తి
నాటేయడంలో తామేమి తక్కువ కాదని స్థానిక యువత తమకంటూ ప్రత్యేకతను కనబర్చుతున్నారు. ఓపక్క విద్యనభ్యసిస్తూ…మరోపక్క వ్యవసాయంలో తల్లిదండ్రులకు ఆసరాగా మారారు. స్నేహితులతోకలిసి నాటేసేందుకు విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబర్చుతున్నారు. నాటేయటంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మడుల్లో నాటేసి ఆశ్చర్యపరుస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.
అంతేగాకుండా గ్రామంలో ఇతర రైతులకు సైతం కూలీలుగా నాటేసేందుకు వెళ్తున్నారు. ఒక ఎకరానికి నాటేసేందుకు రూ.5 వేల వరకు కూలీ చెల్లిస్తున్నారు. కూలీలకొరతతో ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలు అధిక కూలీ డిమాండ్ చేయడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు వలస కూలీలు డిమాండ్ చేసే అవకాశం ఇవ్వకుండా.. వారే వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. లచ్చపేటలో పదిమంది విద్యార్థులు ఒక జట్టుగా మారి పొలం దున్నడం నుంచి మొదలు నాట్లు వేసే వరకు రైతులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు.
ఖాళీగా ఉండకుండా…
నేను పీజీ(ఎమ్మెస్సీ) పూర్తి చేశాను. ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నాను. గ్రూప్ -4 రాశాను. అయితే ఖాళీగా ఉండకుండా వ్యవసాయం పనులు చేస్తున్నాను. మాకున్న పొలంలో పనులు చూసుకుంటూ.. గ్రామంలో తెలిసిన వాళ్లకు నాటేసే పనులకు వెళ్తుంటాను. చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే నాకు చాలా ఇష్టం. గ్రామంలో విద్యార్థులందరూ చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తుంటాం. చదువు, ఇతర ఖర్చులకు వ్యవసాయ
పనులకు వచ్చిన డబ్బులు పనికివస్తాయి.
– చెట్ల సురేశ్, ఎమ్మెస్సీ విద్యార్థి, లచ్చపేట
వ్యవసాయమంటే మక్కువ
నేను డిగ్రీ చదువుతున్నాను. కళాశాల పూర్తికాగానే వ్యవసాయ పనులు చూసుకుంటాను. సెలవు దినాలతో పాటు ప్రస్తుత వరి నాట్ల సమయంలో మిత్రులతో కలిసి వ్యవసాయ పనులకు పోతాం. ఎకరానికి నాలుగున్నర వేల నుంచి రూ.5 వేలు తీసుకుని నాటేస్తాం. పక్క రాష్ర్టాల కూలీలతో పోల్చితే.. వారికంటే మేమే వేగంగా నాటేస్తాం. మిత్రులతో కలిసి వ్యవసాయ పనులు చేయటం చాలా సంతోషంగా ఉంటుంది.
– చెట్ల సురేశ్, డిగ్రీ విద్యార్థి, లచ్చపేట
వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు ఆసరాగా..
మాకు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాను. పొలం దున్నడం,నాటేయడం తర్వాత పండిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే వరకు చూసుకుంటాను. చదువుతోపాటు వ్యవసాయ పనులు చేయడం చాలా సంతోషంగా ఉంది. స్నేహితులతో కలిసి వ్యవసాయ పనులు చేయడం సరదాగా ఉంటుంది.
– పెంబర్తి కార్తిక్, లచ్చపేట