పటాన్చెరు, మే 8: బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక స్వరూపం దృష్ట్యా కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటు రెవెన్యూ పాలన ప్రజలకు అందుబాటులో తెచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ పటాన్‌చెరుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంజూరు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు పటాన్చెరు అభివృద్ధి పెద్దపీట వేశారు.
అంతలోనే ఎన్నికలు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పటాన్చెరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటు అటకెక్కింది. దీంతో నియోజకవర్గ ప్రజలకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పనులు ఉంటే సంగారెడ్డి పట్టణానికి పోవాల్సి వస్తున్నది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనులు ఉన్న ప్రతిసారి సంగారెడ్డికి పోవాల్సిందే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో కేసీఆర్ ప్రభు త్వం పటాన్‌చెరుకు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం మంజూరు చేసింది.
బీఆర్ఎస్ హ యాంలో మంజూరు చేసిన ఈ రెండు కార్యాలయలను కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా టు చేయడం లేదనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయ ఏర్పాటు గురిం చి బీఆర్ఎస్ స్థానికులతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ శాఖకు ఈ ప్రాంతం నుంచి అధిక ఆదాయం వస్తున్నా పటాన్చెరులో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆఫీసును మాత్రం ఏర్పాటు చేయడం లేదు.
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు మేలు
పటాన్‌చెరుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం మంజూరు చేసి, ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులోకి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేసింది. పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు బీఆర్ఎస్ సర్కారు అప్పట్లో జారీచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డీవో, రిజిస్ట్రేషన్ కార్యాలయలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు.
భౌగోళికంగా సంగారెడ్డికి పటాన్చెరు 23 కిలోమీటర్లు, రామచంద్రపురం 31 కిలోమీటర్లు, అమీన్‌పూర్‌కు 33 కిలోమీటర్లు, జిన్నారం గ్రామానికి 36 కిలోమీటర్లు, గుమ్మడిదలకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మండలాల ప్రజల రెవెన్యూ పనుల కోసం సంగారెడ్డికి వెళ్లడం దూర భారంగా మారింది. పటాన్చెరు పట్టణం కేంద్రంగా రెవెన్యూ డివిజన్, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సమయం, డబ్బులు కలిసి వస్తాయి.
ప్రజలు ఇండ్లు, ఇంటి స్థలాలు, ఇతర వాణిజ్య భవనాలు అమ్మకాలు, కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం సంగారెడ్డి సమీపంలోని కందికి పోవాల్సి వస్తున్నది. పటాన్చెరులో కార్యాలయం ఉంటే సమయనికి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటికి పోయి, పనులు చేసుకొనే పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్కు పేరు రావద్దనే కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్యాలయాల ఏర్పాటును పెండింగ్‌లో పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు రుద్రారంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ రెండు కార్యాలయాల ఏర్పాటుపై మాట్లాడడంతో మరోసారి ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నిర్వాకం ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు..
పటాన్చెరులో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు రెవెన్యూ పాలన అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదు. పటాన్చెరులో రెవెన్యూ డివిజన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు భూ సమస్యలు ఉన్నప్పుడు, అధికారులను కలిసేందుకు సంగారెడ్డికి పోవాల్సి వస్తున్నది. రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లకు కందికి పోవాల్సి వస్తున్నది. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ డివిజన్ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం తొందరగా ఏర్పాటు చేయాలి. పటాన్చెరు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూడడం మానుకోవాలి.
– ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పటాన్చెరు
సంగారెడ్డికి పోవాల్సి వస్తున్నది..
రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ సమస్యలపై సంగారెడ్డి పట్టణానికి పోవాలంటే దూరభారంతో పాటు డబ్బులు ఖర్చవుతున్నాయి. పటాన్చెరులో రెవెన్యూ డివిజన్, రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆఫీసుల ఏర్పాటును పెండింగ్‌లో పెట్టడం మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిసారించాలి.
– మాణిక్‌యాదవ్, ఐలాపూర్