దుబ్బాక,ఫిబ్రవరి 23 : తెల్లారితే కొడుకు పెండ్లి…అర్ధరాత్రి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పెండ్లి కూతు రు తరుపు వాళ్లు ఫంక్షన్హాల్లో సంతోషం గా వివాహ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా చేదు వార్త వినాల్సి వచ్చింది. వివాహానికి సంతోషంగా వచ్చిన బంధువులు కన్నీటితో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్(66) విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి.
కొంతకాలంగా సత్యనారాయణగౌడ్ తన కుటుంబంతో సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శ్రీనివాస్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువతితో ఆదివారం ఉదయం 10గంటలకు దుబ్బాకలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహం జరగాల్సి ఉంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సత్యనారాయణ గౌడ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. పెండ్లి వాయిదా పడింది.