సిద్దిపేట టౌన్, మే 16: విద్యార్థుల అవసరాల దృష్ట్యా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఉస్మానియ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం స్పష్టం చేశారు. సిద్దిపేట ఓయూ పీజీ కళాశాలను శుక్రవారం ఓయూ ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రతినిధులు కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి సమస్యలు, బోధన తదితర వాటిపై ఆరా తీశారు.
అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ..విద్యార్థుల్లో నైఫుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కళాశాలలో ఎమ్మెస్సీ డాటా సైన్స్ కోర్సును ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని, డిమాండ్ దృష్ట్యా ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపునకు కృషి చేస్తామన్నారు.
బోధనేతర సిబ్బంది వేతనాల పెంపునకు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరిస్తామన్నారు. అంతకు ముందు ఓయూ ప్రతినిధి బృందం కలెక్టర్ మనుచౌదరిని మర్యాదపూర్వకంగా కలిసింది. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పలు ప్రతిపాదనలను బృందం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రధాన రహదారి మెయిన్ ఎంట్రెన్స్ గేట్ నుంచి కళాశాల ప్రాంగణంలోని బాయ్స్ హాస్టల్ వరకు రోడ్డు వేయిస్తామని, వీధి దీపాలు, తాగునీటి సౌక ర్యం కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామనని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు నరేశ్‌రెడ్డి, జితేందర్ కుమార్‌నాయక్, రాజేంద్రనాయక్, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కళాశాల సమన్వయకర్త రవినాథ్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.