హుస్నాబాద్, డిసెంబర్ 18: నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌లు ముందుండి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాన్ని విద్య, వైద్య, ఉపాధి కల్పన, వ్యవసాయం, టూరిజం రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం కొత్తగా గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. అంతకు ముందు హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో బైక్‌పై తిరుగుతూ అభివృద్ధి పనులకు మంత్రి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి అధికారులతో సమీక్ష…
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు జరుగుతున్న జాతీయ రహదారి పనులపై సంబంధిత అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.