గుమ్మడిదల, అక్టోబర్ 19: పరిశ్రమల కాలుష్యంపై ఎదురు తిరిగి పోరాడితేనే న్యాయం జరుగుతుందని పర్యావరణవేత్త డాక్టర్ బాబురావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగులో భారీ పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్థ జలాలతో కలుషితమైన నల్లకుంట చెరువును ఆదివారం పర్యావరణవేత్తలు పరిశీలించారు. ఈ చెరువు పూర్తిగా కాలుష్య జలాలతో కలుషితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలపై ప్రజలంతా ఏకమై పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కాలుష్యంతో జరుగుతున్న అనర్థాలపై అనంతరం దోమడుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యాదయ్య అనే రైతు మాట్లాడుతూ.. నల్లకుంట చెరువు ఆయకట్టు కింద తనకు రెండెకరాల పొలం ఉందన్నారు. ఇక్కడ వరి సాగు చేసుకుని తీవ్ర నష్టపోతున్నానని తెలిపారు. చెరువులో కాలుష్య జలాలు చేరి పంటకు తీవ్రనష్టం జరుగుతోందన్నారు. రైతు కూలీలు కూడా కలుపు తీయడానికి, వరికోతలు కోయడానికి రసాయన కంపుతో రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లకుంట చెరువు పైభాగంలోని భారీ పరిశ్రమ వందల లోతు బోరుబావులు వేసి అందులోకి రసాయన వ్యర్థజలాలు వదలడంతో సమీపంలోని నల్లకుంట నీరు కలుషితం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలో రీబోరింగ్ సిస్టం వల్ల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని తెలిపారు. రైతు మంగలి లక్ష్మయ్య మాట్లాడుతూ.. భారీ పరిశ్రమలకు వందల ట్యాంకుల నీటిని కొనుగోలు చేసి ఉత్పత్తి చేస్తున్నారని, ఉత్పత్తి అయిన వ్యర్థజలాలను ఈటీపీలకు తరలించకుండా నల్లకుంట చెరువులో వదులుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం పరిశ్రమల యాజమాన్యం ఇచ్చే సొమ్ముకు ఆశపడి ప్రజలకు, పర్యావరణానికి నష్టం జరుగుతున్నా స్పందించడం లేదని మండిపడ్డారు.
అనంతరం పర్యావరణ వేత్తలు కనిగిరి రవికుమార్, డాక్టర్ బాబురావు మాట్లాడుతూ.. రసాయన వ్యర్థజలాలతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, చిన్నారులకు చర్మ వ్యాధులు, రైతులకు పంట నష్టం, గాలి కాలుష్యం కావడంతో సమీపంలోని ప్రజలు అనారోగ్య సమస్యలు బారినపడుతున్నారని తెలిపారు. ప్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి చేస్తామని పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని, కానీ.. అది నిజానికి ప్యూచర్ సిటీ కాదు ఫార్మాసిటీ కోసం అనుమతులు తీసుకున్నారని, ఈ విషయం ప్రజలకు తెలయకుండా గోప్యంగా దాస్తున్నారని ఆరోపించారు.
అక్కడి ప్రజలకు అవగాహన కలిగించి పోరాటం చేసి ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకున్నట్లు గుర్తుచేశారు. ఇలాంటివి రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలంతా ఒక్కటై నల్లకుంట చెరువును రక్షించడానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పర్యావరణవేత్తలు జ్ఞానేశ్వర్, అశోక్, ముత్యాలు, నీలాకుమారి, వసంతలక్ష్మి, రైతులు మంగయ్య, బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వేచ్చారెడ్డి, శేఖర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.