అమీన్పూర్, డిసెంబర్ 12 : సాధారణంగా మనకు వ్యవసాయం అంటే వరి పంట గుర్తుకు వస్తుంది. చాలా మంది రైతులు వరి పంట పండిస్తుంటారు. ప్రస్తుతం కాలం మారింది. వరి పంట కాకుండా, ఇతర పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే కొం దరు రైతులు వరికి బదులు ఇతర పంటలను పండిస్తూ లాభాలను గడిస్తున్నారు. నీళ్లు చాలా తక్కువ అవసరమయ్యే పంటలను పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కొందరు రైతులు వరికి బదులుగా ఇతర పంటలను పండిస్తూ లాభాల బాటలో కొనసాగుతున్నారు.
వరికి బదులుగా అరటి పంటలు..
వరికి బదులుగా రైతులు జామ, అరటి సాగుచేస్తున్నారు. జామ సాగుకు ఎకరానికి ఏడాదికి సుమారుగా రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఆదా యం రూ.2.50 లక్షల మేర వస్తుంది. అందులో ఖర్చులు రూ.లక్ష తీసేస్తే రూ.1.50 లక్షలు మిగుతాయి. జామ సాగుకు నీళ్లు కూడా పెద్దగా అవసరం ఉండదు. నెలకు రెండు సార్లు నీళ్లు పెడితే చాలు. పంటను నేరుగా తమ వద్దకే వచ్చి వ్యాపారులు తీసుకెళ్తారని రైతులు తెలిపారు.
అరటి పంటతో ఆదాయం..
అరటి పంటను పండిస్తూ రైతులు లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు. అమీన్‌పూర్‌లోని రైతులు అరటి పంటను పండిస్తున్నారు. ఈ పంటకు కూడా నీళ్లు పెద్దగా అవసరం ఉండవు. ఎకరానికి రూ.50 వేల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా రైతులు వరికి బదులుగా ఇతర పంటలను పండిస్తూ లాభాలు పొందుతున్నారు.
డ్రిప్ ఇరిగేషన్‌తో నీటి పొదుపు..
రైతులు అంతర పంటల కింద బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలను సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే, నీళ్లను పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. అమీన్‌పూర్‌కు చెందిన రైతులు ప్రస్తుతం ఈ విధంగా పెద్ద ఎత్తున ఇతర పంటలను, వాటిల్లో అంతర పంటలను సాగుచేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. ఏటా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇతర పంటలే మేలు
రైతులు వరి పండించడంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి ధర తక్కువగా వస్తున్నది. అందుకు ఇతర పంటలు వేస్తే పోటీ ఉండదు. ఎక్కువ ధర పొందవచ్చు. ఇతర పంటలే మేలుగా కనిపిస్తున్నాయి.
-మణిధర్, రైతు, అమీన్పూర్
రెండున్నర ఎకరాల్లో జామ సాగు
రెండున్నర ఎకరాల్లో జామ పంట పండిస్తున్నా. నీళ్లు పెద్దగా అవసరం ఉండవు. రూ.1.50 లక్షల ఆదాయం వస్తుంది. 5,6 మంది పనిచేస్తే చాలు. వ్యాపారులు తోట దగ్గరకే వచ్చి పంటను కొంటున్నారు. పంట దిగుబడి లాభసాటిగా ఉంది.
-నారాయణ, రైతు, అమీన్పూర్