నిజాంపేట : రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో వరిసాగు చేస్తున్న అన్నదాతలు అరిగోస పడుతున్నరు. యాసంగి సీజన్ ప్రారంభంలో సరిపడా నీళ్లు ఉండటంతో నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులు ఎక్కువ మొత్తంలో వరిపంటను సాగు చేశారు. కాని ప్రస్తుత పరిస్థితులు కరువుకు దారి తీసేలా ఉన్నాయి. బోర్ల నుంచి నీళ్లు రావడం తక్కువై బోర్లు ఎత్తిపోయి రైతులకు దుఃఖాన్ని మిగుల్చుతున్నాయి. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.
కేసీఆర్ సార్ గనుక సీఎంగా ఉండి ఉంటే ఈ పాటికి కాలువల ద్వారా కాలేశ్వరం నీళ్లను తమ ఊరుకు తెస్తుండెనని, ఆ నీళ్లతో మంచిగా పంటలు పండించుకునే వాళ్లమని రజాక్పల్లి గ్రామానికి చెందిన రైతు దేవుని కొండల్ చెప్పారు. రజాక్పల్లి చెరువు కిందనే తాను 300 ఫీట్ల బోరు వేయించానని, మొదట్లో రెండు ఇంచుల పైపు నిండుగా పోస్తుండెనని, దాంతో నాలుగు ఎకరాల వరకు వరి పంట వేశామని ఆయన తెలిపారు. ఇప్పుడు బోరు నుంచి నీళ్లు రాక.. బోరు ఎత్తిపోయి పొట్టకొచ్చిన నాలుగు ఎకరాల వరి చేను పూర్తిగా ఎండిపోయిందన్నారు. ఎకరానికి రూ.30 వేల లాగోడితో మొత్తం లక్ష రూపాయలు ఖర్చైందని చెప్పారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో కనీసం జీవాలు (గొర్రెలు, మేకలు) తాగేందుకు కూడ నీళ్లు దొరుకుతలేవన్నారు. ఇట్లాంటి కరువు కాలం ఎప్పుడు చూడలేదని కొండల్ చెప్పారు.