సదాశివపేట, డిసెంబర్ 24: సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం దుర్వాసనతో కంపుకొడుతున్నది. ఎక్కడపడితే అక్కడ కుళ్లిన వ్యర్థాలు పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతున్నది. మార్కెట్ యార్డుకు ప్రహరీ లేక లోపల భాగం పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నది. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ పారవేయడంతో చెత్త పేరుకుపోతున్నది. పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.
ప్రహరీ చుట్టూ చెట్లు పెరగడం, పిచ్చిమొక్కలు ఎక్కువగా ఉండడంతో కొంత మంది ఇక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మార్కెట్కు నిత్యం వందలసంఖ్యలో రైతులు వస్తుంటారు. సివిల్ సప్లయ్, బియ్యం గోదాంలు ఉండడంతో కార్మికులు వస్తూపోతుంటారు. వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అసంపూర్తిగా ఉండడంతో అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువువడంతోనే మార్కెట్ కంపుకొడుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. యార్డులోనే మున్సిపల్ కార్యాలయం ఉంది. కానీ, నిర్వహణను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు స్పందించి చెత్తాచెదారం తొలిగించాలని పలువురు కోరుతున్నారు.