సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 18: కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగాన్ని తలపించిందని, అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మలిచారని కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయ శర్మ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టకర్త, రాజసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేప్పటిన వృక్షార్చన కార్యక్రమంలో కేసీఆర్ గురువు పాల్గొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధకులు. రైతు బంధువు, హరిత ప్రేమికులు కేసీఆర్ పుట్టినరోజున మొక్కలను నాటడం సంతోషకరంగా ఉందన్నారు. కేసీఆర్ మానస పుత్రిక హరితహారంతో తెలంగాణ రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చారని కొనియాడారు. ఆయన పదేండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు.
గడిచిన ఏడాది పాలనలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని స్పష్టం చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు హరిత సేన నియోజకవర్గ ఇన్చార్జి బాలకృష్ణ వర్మ, బీఆర్ఎస్ సీనియర్ నేత మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేశారు. కార్యక్రమంలో నేతలు నాగరాజు, గణేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.