గజ్వేల్, మార్చి 8: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, అప్పుడే అనుకున్న రంగంలో రాణిస్తారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళల పాత్ర కీలకం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, సమైక్య పాలనలో తాగడానికి తాగునీరు దొరకని పరిస్థితి ఉండేదన్నారు. కేసీఆర్ ఇంటింటికీ తాగునీరు అందించి ఆడబిడ్డల కష్టాలు తీర్చినట్లు తెలిపారు. మేనమామ కానుకగా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేళపెట్టి ఆదుకున్నారని గుర్తుచేశారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు న్యూట్రీషన్ కిట్ పథకాన్ని అమలు చేశారన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి అందించారన్నారు. మహిళల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేసినట్లు కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు పాల్గొన్నారు.