గజ్వేల్, జనవరి 6: రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రజలకిచ్చిన హా మీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుం చి అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను, రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.
మూడు పంటలకు రూ.15వేల రైతు భరోసా ఇస్తామని మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఎందుకు మాట మీద నిలబడడం లేదన్నారు. రైతులకు బోనస్, రూ. రెండు లక్షల రుణమాఫీ సంఫూర్ణంగా చేయలేకపోయారన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది మరొకటన్నారు. పొంతనలేని హామీలతో అధికారంలోని వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు కేసీఆర్ రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రదేశపెట్టడంలో ఎంతో కృషి ఉందని, మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పం డించారన్నారు. 13నెలల కాలంలోనే రాష్ట్రంలో రూ.7వేల కోట్ల ఆదాయం తగ్గిందని, మరో మూడు నెలల్లో అది కాస్తా రూ.10వేల కోట్లకు చేరుతుందన్నారు.
రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానాల కారణంగా రాష్ట్రం దివాలా అంచునకు చేరిందన్నారు. ప్రతి ఎకరాకు ప్రభుత్వం రూ.17, 500 బాకి పడిందని, హామీలను మరిపించేందుకే కేటీఆర్‌పై ఏసీబీ, ఈడీ కేసులు పెట్టించారని నరేంద్రమోదీ, రేవంత్‌రెడ్డి కుమ్ముకై రాష్ట్రంలో అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు ఆరు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ కాలువల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎక్కడ కూడా పనులు ప్రారంభించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సీజన్ ప్రారంభంలోనే కూడవెళ్లి, హల్దీ వాగు ల్లో సాగునీళ్లు వదలడంతో వేలాది ఎకరాల్లో రైతు లు వరి సాగు చేసుకున్నారని చెప్పారు.
గజ్వేల్ అవినీతికి అడ్రస్‌గా మారిందని, ఎక్కడ చూసినా అవినీతే ఉందన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని స్థానిక కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నరని విమర్శించారు. గజ్వేల్ ప్రాంతంలో వసూళ్లకు పాల్పడిన వారి పేర్ల చిట్టాను త్వరలోనే బయటపెడుతామని ఎవ్వరిని వదిలిపెట్టబోమన్నారు. రుణమాఫీ కాని, నేటికీ రైతు భరోసా అందని రైతులతో కలిసి కోటమైసమ్మ ఆలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వేలాది మంది రైతులతో కేసీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో త్వరలోనే భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు.
సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జకీయొద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు మధు, నవాజ్ మీరా, కౌన్సిలర్లు చందు, శ్రీనివాస్, కిషన్‌రెడ్డి, కనకయ్య, నాయకులు కృష్ణారెడ్డి, మల్లేశం, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, విరాసత్ అలీ, జఫర్‌ఖాన్, దేవేందర్, రమేశ్‌గౌడ్, రాజిరెడ్డి, ఎల్లయ్య, ఆర్కే శ్రీను, స్వామిచారి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.