గజ్వేల్, ఏప్రిల్ 27: గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎల్కతుర్తి సభకు ఆదివారం బీఆర్ఎస్ సైనికులు పెద్దఎత్తున తరలివెళ్లారు. ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదులుకుని కొండపాక మండలం దర్గా వరకు దారిపొడవునా ఆర్టీసీ, ప్రైవేటు బస్సు లు రజతోత్సవ భారీ బహిరంగ సభకు తరలివెళ్లాయి. తూప్రాన్, మనోహరాబాద్, మర్కూక్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, గజ్వేల్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాల బస్సులు ఒకేసారి బయలుదేరడంతో రోడ్డంతా గులాబీమయంగా మారింది. నియోజకవర్గంలో 280కి పైగా బస్సులు వరంగల్ సభకు బయలుదేరాయి.
ఆదివారం గజ్వేల్ పట్టణంలో తెలంగాణతల్లి విగ్రహం వద్ద పార్టీ జెండావిష్కరణలో ఎమ్మె ల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశా రు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. అనంతరం జెండా ఊపి వరంగల్ సభకు బస్సులను పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలో నిలిచేలా ఈ సభ విజయవంతం అవుతుందని, ప్రతి ఒక్కరూ కేసీఆర్ వైపే మళ్లీ చూస్తున్నారని, ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజలను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్లు మాదాసు శ్రీనివాస్, జహంగీర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఏప్రిల్ 27: తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలే పరమావధిగా పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అంటే తమ ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి అన్నారు. పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పక్కన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు సభకు తరలివెళ్లారు. పటాన్చెరు. రామచంద్రపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలిపోయారు. ఆదర్శ్‌రెడ్డి బీరంగూడ కామన్ నుంచి పటాన్చెరు మైత్రి మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
పటాన్చెరులో కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్య మైత్రిమైదానంలో వాహనాలు ఏర్పాటు చేసి వరంగల్ సభకు నాయకులు, కార్యకర్తలను తరలించారు. పటాన్చెరు పట్టణం గులాబీమయంగా మారిపోయింది. కార్పొరేట్ మెట్టు కుమార్ యాదవ్ భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలను తరలించడంతో పటాన్చెరులో బీఆర్ఎస్కు పూర్వవైభవం వచ్చిందని నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. తెల్లాపూర్, కొల్లూర్ వైపు నుంచి బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, సాయిచరణగౌడ్ అంబాసిడర్ కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
రామచంద్రాపురం నుంచి కార్పోరేటర్ సింధూరెడ్డి, అంజయ్య, రాములు గౌడ్ వరంగల్ సభకు భారీసంఖ్యలో ప్రజలను తరలించారు. జిన్నారం మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుడు వెంకటేశం, మండల శాఖ అధ్యక్షులు రాజేశ్, బొల్లారం మున్సిపాల్ నుంచి మాజీ జడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వరంగల్ సభకు తరలివెళ్లారు. బీఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, ఐలాపుర్ మాణిక్యాదవ్తో పాటు పలువురు నాయకులు వరంగల్ సభకు తరలివెళ్లారు. ఆదివారం పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు వార్డుల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబురాలు నిర్వహించారు.