పాపన్నపేట, జూలై16: ఆషాఢ మాసం నాల్గో ఆదివారాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి చుట్టూ ప్రత్యేకంగా పూల తొట్టిల్లో మొక్కలను ఉంచి వనం ఆకారంలో అలంకరించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చన, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో విందు భోజనాలు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, రవివీర్ కుమార్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, వరుణాచారి, రాజు, యాదగిరి, శ్రీకాంత్ తదితరులు ఏర్పాటు చేయగా, వేదపండితులు పార్థీవశర్మ, శంకర్‌శర్మ, రాముశర్మ, మురళీధర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్ఐ విజయ్ కుమార్ ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.