Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు మంగళవారం వేకువజాము నుంచే వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలోని శ్రీ కోదండ రామాయలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాచవరం సర్పంచ్ దాసరి సాంబశివరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కమిటీ డైరెక్టర్ బెల్లం శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్టలో ఉదయం 5.40 నిమిషాల నుంచి ఉత్తర గోపురం ద్వారా లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. వేములవాడలో రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

