జహీరాబాద్, జనవరి 3: అడవి బిడ్డలకు మరిగమ్మ మోతిమాత జాతర సంబురమొచ్చింది. కొండాకోనళ్లో ఉంటూ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి ఒడిలో జీవనాన్ని కొనసాగించే గిరిజన పుత్రులు రెండు రోజుల పాటు తమ కులదైవానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి తరలివచ్చే అడవి బిడ్డలతో ప్రకృతి పులకించనున్నది. ఈ అద్భుత ఘట్టానికి మరిగమ్మ మోతిమాత దేవాలయం వేదిక కానున్నది. ఈ నెల 5,6 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు, ఆలయాల కమిటీ సభ్యులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్‌పల్లి తండాలో ఉన్న దేవాలయం వద్ద జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ‘జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేస్తాం.. పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’. అని ఆదేశాలు జారీ చేశారు. జాతర ఉత్సవాలకు వచ్చే వీఐపీలకు ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెండు వైపులా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి వసతి, పారిశుధ్య పనులు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్నారు. కరెంట్ సమస్య లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ శరత్ అదేశాలతో అధికారులు దేవాలయల వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షణ చేస్తున్నారు.
గిరిజనుల పాలిట కల్పవల్లి
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పుర్పలి ్లతండా శివారులో గిరిజనుల ఆరాధ్యదైవం మరిగమ్మ మోతిమాత దేవస్థానం ఉంది. ఈ దేవాలయంలో మోతిమాత కొలువుదీరి గిరిజనుల కోర్కెలు తీరుస్తూ వారి పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. పిల్లలు లేని దంపతులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే సంతానం కలుగుతుందని గిరిజన పెద్దలు చెబుతున్నారు. దీంతో కొత్తగా పళ్లైన వధూవరులు, మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది గిరిజనులు తరలివచ్చి మోతిమాతను దర్శించుకుని పూజలు చేస్తారు. దేవాలయ ఆవరణలో ఉన్న చెట్టుకు భక్తులు కొబ్బరికాయలు కడతారు. దేవాలయ ఆవరణలో యజ్ఞ హోమాన్ని నిర్వహించి పూజలు చేస్తారు. ఉత్సవాల్లో ఎలాంటి పారిశుధ్య సమస్యలు లేకుండా పనులు చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ, రవాణా శాఖ అధికారులు తాగునీటి, రవాణా సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లు నిర్మాణం చేస్తున్నారు. 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాలయ కమిటీ సభ్యులు అధికారులకు తెలిపారు.
ప్రజాప్రతినిధులకు ఆహ్వానం
మోతిమాత జాతర ఉత్సవాలకు రావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ డాక్టర్ శరత్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, మొగుడంపల్లి జడ్పీటీసీ అరుణమోహన్రెడ్డిలను ఆహ్వానించారు. గతంలో మంత్రి హరీశ్‌రావు ఉత్సవాలకు హాజరై నిధులు మంజూరు చేయడంతో అనేక అభివృద్ధి పనులు చేశారు. ఉప్పుర్పల్లి తండా వరకు రోడ్డు నిర్మాణంతో పాటు దేవాలయం వద్ద సామూహిక భవనాన్ని , తాగునీటి కోసం ట్యాంకులు నిర్మించారు. ఈనెల 6న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు జాతరకు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో జోరుగా పనులు
జాతర ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ శరత్ ప్రకటించడంతో అధికారులు పనులు వేగంగా చేస్తున్నారు. పర్వతాపూర్ నుంచి దేవాలయం వరకు రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. దేవాలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతరకు రెండు వైపులా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్ నిర్మిస్తున్నారు. తాగునీటి ట్యాంకర్లు, పారిశుధ్య ట్యాంకర్లు ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీపీవో సురేశ్‌మోహన్, జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎస్పీ రఘులను ఉత్సవాల పర్యవేక్షణ కోసం నియమించారు. సంగారెడ్డి ఆడిషనల్ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డిలు పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.